ఐపీఎల్‌-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారు..!

IPL 2023 Mini Auction To Be Held On December 16 Says Report - Sakshi

ఐపీఎల్‌-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గత సీజన్‌ వేలం జరిగిన బెంగళూరులోనే ఈసారి కూడా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌-2023 సీజన్‌ను మార్చి చివరి వారంలో ప్రారంభించాలని భావిస్తున్న బీసీసీఐ.. డిసెంబర్‌ 16న మినీ వేలాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

ఇటీవల జరిగిన ఆన్యూవల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో మినీ వేలం తేదీని ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్‌ వ్యాల్యూని కూడా సవరించారని తెలుస్తోంది. పర్స్‌ వ్యాల్యూని రూ. 90 నుంచి 95 కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అక్టోబర్ 18న జరిగే వార్షిక సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ను హోమ్‌ అండ్‌ అవే పద్దతిలో (ఇంటా బయటా) నిర్వహిస్తామని బీసీసీఐ తాజా మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ దిగిపోవడం, సమీకరణలన్నీ మారిపోవడంతో ఐపీఎల్‌ను ఎక్కడ, ఎలా నిర్వహిస్తారో అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. 

మరోవైపు ఈసారి నిర్వహించబోయే వేలంలో ఏయే మార్పులు జరుగుతాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎస్‌కే నుంచి రవీంద్ర జడేజా, గుజరాత్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్‌ బయటకు వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు పలువురు కొత్త విదేశీ ప్టార్లు కూడా వస్తారని అభిమానులు భావిస్తున్నారు. మినీ వేలం.. టీ20 వరల్డ్‌కప్‌లో ప్రదర్శన ఆధారంగా జరుగనుందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top