IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్‌.. ఐపీఎల్‌ వేలం విశేషాలు

IPL 2023 Auction: Punjab buys Sam Curran for Rs18. 5 cr, Cameron Green costs Rs17. 5 cr to Mumbai Indians - Sakshi

వేలంలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌కు రూ. 18 కోట్ల 50 లక్షలు

భారీ మొత్తానికి ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు

గ్రీన్‌కు రూ. రూ. 17 కోట్ల 50 లక్షలు

స్టోక్స్‌కు రూ. 16 కోట్ల 25 లక్షలు

ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌ పంట పండింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన కరన్‌కు ఊహించినట్లుగానే ఐపీఎల్‌ వేలంలో భారీ మొత్తం పలికింది. పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ అతడిని ఏకంగా రూ. 18 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌ వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కాగా... లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా 24 ఏళ్ల కరన్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ (2021లో రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది) పేరిట ఉంది. 

వేలంలో మాత్రమే కాకుండా ఓవరాల్‌గా కూడా కరన్‌దే ఎక్కువ మొత్తం కావడం విశేషం. కోహ్లిని రీటెయిన్‌ చేసుకున్నప్పుడు కూడా బెంగళూరు... కేఎల్‌ రాహుల్‌ కోసం లక్నో గరిష్టంగా రూ. 17 కోట్లు చెల్లించాయి.  ఇక అంచనాలకు అనుగుణంగా ఆల్‌రౌండర్లు కామెరాన్‌ గ్రీన్‌ (ఆస్ట్రేలియా), బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌) కూడా భారీ మొత్తం పలకగా, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌పై కూడా తొలి ఐపీఎల్‌లోనే కోట్ల వర్షం కురిసింది.

అటు ఐపీఎల్‌లో, ఇటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ‘నిలకడగా’ పేలవ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడం అనూహ్యం.   

కొచ్చి: ఐపీఎల్‌ వేలంలో ఇంగ్లండ్‌ యువస్టార్‌ స్యామ్‌ కరన్‌ బాక్స్‌లు బద్దలు కొడితే ఆశ్చర్యపోవద్దు! వేలానికి ముందు పలువురు క్రికెట్‌ విశ్లేషకులు, మాజీల మాట ఇది. నిజంగానే ఈ మాట నిజమైంది. వారి అంచనా తప్పలేదు. ఎందుకంటే కరన్‌ బంతితో, బ్యాట్‌తో రెండు రకాలుగా ప్రభావం చూపించగల  డని అత్యున్నత స్థాయిలో ఇప్పటికే రుజువైంది. ఇటీవల టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా కూడా నిలి చాడు. అన్నింటితో పాటు అతని వయసు 24 ఏళ్లే!

సరిగ్గా ఇదే కోణంలో ఫ్రాంచైజీలు ఆలోచించాయి. అందుకే అతని కోసం పోటీ పడ్డాయి. ముంబైతో మొదలు పెడితే బెంగళూరు, రాజస్తాన్, చెన్నై, పంజాబ్‌ విలువను పెంచుకుంటూ పోయాయి. చివరకు ముంబై రూ.18 కోట్ల వరకు తీసుకురాగా, పంజాబ్‌ మరో రూ.50 లక్షలు పెంచి రూ. 18 కోట్ల 50 లక్షలకు కరన్‌ను సొంతం చేసుకుంది.

2019 ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్టే కరన్‌కు రూ. 7 కోట్ల 20 లక్షలు చెల్లించింది. తర్వాతి రెండు సీజన్లు చెన్నైకి ఆడిన అతను గాయంతో గత సీజన్‌కు దూరమయ్యాడు. ఓవరాల్‌గా 32 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 9.21 ఎకానమీతో 32 వికెట్లు తీసిన కరన్‌... 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 337 పరుగులు చేశాడు.   

ఆ ముగ్గురూ సూపర్‌...
ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడైన బెన్‌ స్టోక్స్‌కు సరైన విలువ లభించింది. అతని కోసం హైదరాబాద్, లక్నో మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరకు రూ. 16 కోట్ల 25 లక్షలకు అతను చెన్నై జట్టులోకి చేరాడు.

వేలంలో చెన్నై తరఫున అత్యధిక విలువ పలికిన ఆటగాడిగా దీపక్‌ చహర్‌ (రూ. 16 కోట్లు) రికార్డును స్టోక్స్‌ సవరించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ భారీ మొత్తం (రూ. 17.5 కోట్లు) చెల్లించింది.

ఓవరాల్‌గా టి20 రికార్డు గొప్పగా లేకపోయినా... ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల నైపుణ్యం, ఆకట్టుకునే పేస్‌ బౌలింగ్‌తో పాటు ఇటీవల భారత గడ్డపై చేసిన రెండు ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీలు గ్రీన్‌ విలువను పెంచాయి. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ను పెద్ద మొత్తానికి (రూ. 13 కోట్ల 25 లక్షలు) సన్‌రైజర్స్‌ ఎంచుకుంది. దూకుడైన ఆటతో మిడిలార్డర్‌లో, ఫినిషర్‌గా సత్తా చాటగల బ్రూక్‌ ఇటీవల పాకిస్తాన్‌తో టి20 సిరీస్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు.   

గత ఐపీఎల్‌లో నికోలస్‌ పూరన్‌ సన్‌రైజర్స్‌ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో కలిపి 306 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌ ఒక్కటీ జట్టుకు చెప్పుకోదగ్గ విజయం అందించలేకపోయింది. నాడు అతనికి రైజర్స్‌ రూ. 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. ఇక ఇటీవలి వరల్డ్‌కప్‌లోనైతే అతను 5, 7, 13 చొప్పున పరుగులు చేశాడు. అయినా సరే, వేలంలో పోటీ బాగా కనిపించింది! ఎడంచేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ కావడం ఒక కారణం కావచ్చు. చివరకు రూ. 16 కోట్లకు లక్నో ఎంచుకోవడం విశేషం.  

వేలం ఇతర విశేషాలు  
► అందరికంటే ముందుగా విలియమ్సన్‌ పేరు రాగా సన్‌రైజర్స్‌ పట్టించుకోలేదు. గుజరాత్‌ రూ. 2 కోట్లకు విలియమ్సన్‌ను తీసుకుంది. స్వదేశీ ఓపెనర్‌ అవసరం ఉన్న సన్‌రైజర్స్‌...చెన్నైతో చివరి వరకు పోటీ పడి మయాంక్‌ అగర్వాల్‌ను రూ. 8 కోట్ల 25 లక్షలకు తీసుకుంది.  జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజాకు తొలి అవకాశం దక్కింది. పంజాబ్‌ కింగ్స్‌ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.    

► ఆంధ్ర యువ క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ను రూ. 20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. ఆంధ్ర కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ను గుజరాత్‌ రూ. కోటీ 20 లక్షలకు తీసుకుంది.  హైదరాబాద్‌ యువ ఆటగాడు భగత్‌ వర్మను రూ. 20 లక్షలకు చెన్నై... ఆంధ్ర ప్లేయర్‌ నితీశ్‌ రెడ్డిని రూ. 20 లక్షలకు సన్‌రైజర్స్‌ ఎంచుకున్నాయి.    ఐర్లాండ్‌ బౌలర్‌ జోష్‌ లిటిల్‌ను రూ. 4 కోట్ల 40 లక్షలకు గుజరాత్‌ తీసుకుంది. ఐపీఎల్‌ ఆడ నున్న తొలి ఐర్లాండ్‌ ప్లేయర్‌గా లిటిల్‌ ఘనత వహిస్తాడు. 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top