RCB Vs KKR: శ్రేయస్‌.. నితీశ్‌ చేతికి బంతి ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది: వసీం జాఫర్‌

IPL 2022 RCB Vs KKR: Wasim Jaffer Surprised That Shreyas Did Not Bowl Nitish Rana - Sakshi

IPL 2022 RCB Vs KKR: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ పెదవి విరిచాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లను ఎదుర్కొనేందుకు వరుణ్‌ చక్రవర్తి ఇబ్బంది పడుతున్న వేళ పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ నితీశ్‌ రాణాను ఎందుకు రంగంలోకి దించలేదని ప్రశ్నించాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేని ఆండ్రీ రసెల్‌తో బౌలింగ్‌ చేయించే బదులు రానా చేతికి బంతిని ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రేయస్‌ బృందం పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ శ్రేయస్‌ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ తరఫున ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన రూథర్‌ఫర్డ్‌, షాబాజ్‌ అహ్మద్‌లకు బౌలింగ్‌ వేయించిన తీరును విమర్శించాడు.

‘ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నపుడు... వరుణ్‌ చక్రవర్తి వాళ్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్న వేళ.. శ్రేయస్‌ అయ్యర్‌ నితీశ్‌ రాణాతో బౌలింగ్‌ చేయించకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రసెల్‌ బౌలింగ్‌ చేయడంలో ఇబ్బంది పడుతున్నపుడు రానాతో ఒకటి లేదంటే రెండు ఓవర్లు వేయించాల్సింది.

అంతేకాదు వెంకటేశ్‌ అయ్యర్‌ను కూడా కాస్త ముందుగానే రంగంలోకి దించాల్సింది’’ అని వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కేకేఆర్‌ బౌలర్‌ వరుణ్‌ 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఇక రసెల్‌ 2.2 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్‌కు రెండు, టిమ్‌ సౌథీకి మూడు, సునిల్‌ నరైన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. 

ఆర్సీబీ వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌ స్కోర్లు:
కేకేఆర్‌- 128 (18.5)
ఆర్సీబీ- 132/7 (19.2)

చదవండి: Harshal Patel: ఐపీఎల్‌ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top