
Hardik Pandya: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను రనౌట్ చేసే క్రమంలో గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా బుల్లెట్ వేగంతో విసిరిన త్రో దెబ్బకు స్టంప్స్ (ఎల్‌ఈడీ) విరిగి రెండు ముక్కలయ్యాయి.
Hardik Pandya breaks the stumps. #IPL20222 #GTvsRR pic.twitter.com/VNcU6uswuT
— Cricketupdates (@Cricupdates2022) April 14, 2022
హార్ధిక్ ఉద్దేశపూర్వకంగా చేయని ఈ పని వల్ల గుజరాత్ జట్టుకు శాంసన్ వికెట్ రూపంలో ప్రతిఫలం లభించగా, ఐపీఎల్ నిర్వహకులకు మాత్రం లక్షల్లో నష్టం వాటిల్లింది. ఆధునిక టెక్నాలజీని వినియోగించి తయారు చేసే ఈ ఎల్‌ఈడీ వికెట్ల ధర రూ. 45 లక్షల వరకు ఉంటుంది. ఈ మొత్తం టీమిండియా మ్యాచ్ ఫీజ్‌కు దగ్గరగా ఉంది. టీమిండియా వన్డే మ్యాచ్ ఆడితే రూ. 60 లక్షలు లభిస్తుండగా, టీ20 మ్యాచ్‌కు రూ. 33 లక్షలు రెమ్యూనరేషన్‌గా వస్తుంది.
2013లో ఎల్‌ఈడీ స్టంప్స్ వినియోగంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరిగాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా ఆటగాడి వల్ల ఎల్‌ఈడీ స్టంప్స్‌కు నష్టం వాటిల్లితే, ఆ ఖర్చు నిర్వహకుల జేబులో నుంచే భరించాలి. కాబట్టి నిన్న హార్ధిక్ పాండ్యా అనుకోకుండా చేసిన పని వల్ల ఐపీఎల్ నిర్వహకులకు రూ. 45 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఛేదనలో ఆర్‌ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. జోస్ బట్లర్ (54) మినహా రాజస్థాన్ జట్టులో ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో యష్ దయాల్, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా , మహ్మద్ షమీ చెరొక వికెట్ తీశారు.
చదవండి: జో రూట్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్‌బై