IPL 2022 CSK Vs RCB: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు...  సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ

IPL 2022 CSK Vs RCB: Chennai Beat RCB By 23 Runs First Win - Sakshi

IPL 2022 Chennai Super Kings Vs Royal Challengers Bangalore- ముంబై: ఈ మ్యాచ్‌ కంటే ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) నాలుగు మ్యాచ్‌లాడింది. అన్నీంటా ఓటమే! నాలుగుసార్లు విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌కు ఏమాత్రం రుచించని ఈ ఎదురుగాలికి... సుడిగాలి బ్యాటింగ్‌తో ఫలితం సాధించింది.

సూపర్‌కింగ్స్‌ బ్యాటర్స్‌ శివమ్‌ దూబే (46 బంతుల్లో 94 నాటౌట్‌; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), రాబిన్‌ ఉతప్ప (50 బంతుల్లో 89; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సిక్సర్ల సునామీతో ఎట్టకేలకు ఐదో మ్యాచ్‌లో బోణీ కొట్టింది.

మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో 23 పరుగులతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై జయభేరి మోగించింది. ముందుగా చెన్నై  20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసింది. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.

షహబాజ్‌ (27 బంతుల్లో 41; 4 ఫోర్లు), దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. స్పిన్నర్లు మహీశ్‌ తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బ తీశారు. కెప్టెన్‌గా జడేజాకిది తొలి విజయం కావడం విశేషం.  

మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... 
పవర్‌ ప్లేలో చెన్నై స్కోరు 35/1. అప్పటికే ఒక ఓపెనర్‌ రుతురాజ్‌ (17) పెవిలియన్‌లో ప్రేక్షకుడయ్యాడు. ఇంకో ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఉతప్పకు మొయిన్‌ అలీ (3) జతయినా చేసిందేమీ లేదు. దూబే వచ్చాక నెమ్మదిగా 8.4 ఓవర్లో జట్టు స్కోరు 50కి... 10 ఓవర్లలో 2 వికెట్లకు 60 పరుగులకు చేరింది.

కానీ ఆ తర్వాతి 10 ఓవర్లలో ఆట ఎవరి ఊహకందని విధ్వంసంగా సాగింది. చెన్నై ఏకంగా 156 పరుగులు చేసింది. శివమ్‌ దూబే, ఉతప్ప సిక్సర్లతో చుక్కలు చూపించడంతో అప్పటిదాకా భళా అనిపించిన బెంగళూరు బౌలింగ్‌ డీలా పడింది.

హసరంగ 19వ ఓవర్లో ఉతప్ప 2 సిక్సర్లు కొట్టడంతో జట్టు వాయువేగంతో 200 మార్క్‌ దాటింది. మరో షాట్‌కు ప్రయత్నించి కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఉతప్ప నిష్క్రమించడంతో 165 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి ఓవర్‌ ఆసాంతం దూబేనే ఆడి 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు.  

టాపార్డర్‌ టపటపా... 
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరు 50 పరుగులకే డుప్లెసిస్, కోహ్లి, అనూజ్‌ రావత్, మ్యాక్స్‌వెల్‌ వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో షహబాజ్, సుయశ్‌ ప్రభుదేశాయ్‌ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడుతూ జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు.

కానీ కొండను కరిగించేందుకు ఈ కాసేపటి జోరు సరిపోలేదు. ఇద్దర్ని మహీశ్‌ తీక్షణ క్లీన్‌బౌల్డ్‌ చేయగా... దినేశ్‌ కార్తీక్‌ సిక్సర్లు అంతరాన్ని తగ్గించిందే తప్ప విజయం వైపునకు తీసుకెళ్లలేదు. ఆకాశ్‌దీప్‌ కొట్టిన షాట్‌ను రాయుడు కళ్లు చెదిరే క్యాచ్‌గా పట్టేశాడు.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హజల్‌వుడ్‌ 17; ఉతప్ప (సి) కోహ్లి (బి) హసరంగ 88; మొయిన్‌ అలీ (రనౌట్‌) 3; శివమ్‌ దూబే (నాటౌట్‌) 95; జడేజా (సి) అనుజ్‌ (బి) హసరంగ 0; ధోని (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 216. 
వికెట్ల పతనం: 1–19, 2–36, 3–201, 4–201. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–37–0, హాజల్‌వుడ్‌ 4–0–33–1, ఆకాశ్‌ 4–0–58–0, మ్యాక్స్‌వెల్‌ 3–0–29–0, షహబాజ్‌ 2–0–18–0, హసరంగ 3–0–35–2. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) జోర్డాన్‌ (బి) తీక్షణ 8; అనూజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 12; కోహ్లి (సి) దూబే (బి) ముకేశ్‌ 1; మ్యాక్స్‌వెల్‌ (బి) జడేజా 26; షహబాజ్‌ (బి) తీక్షణ 41; ప్రభుదేశాయ్‌ (బి) తీక్షణ 34; కార్తీక్‌ (సి) జడేజా (బి) బ్రేవో 34; హసరంగ (సి) జోర్డాన్‌ (బి) జడేజా 7; ఆకాశ్‌ (సి) రాయుడు (బి) జడేజా 0; సిరాజ్‌ (నాటౌట్‌) 14; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 193.
వికెట్ల పతనం: 1–14, 2–20, 3–42, 4–50, 5–110, 6–133, 7–146, 8–146, 9–171. బౌలింగ్‌: మొయిన్‌ అలీ 3–0–19–0, ముకేశ్‌ 3–0–40–1, మహీశ్‌ తీక్షణ 4–0–33–4, రవీంద్ర జడేజా 4–0–39–3, జోర్డాన్‌ 2–0–20–0, బ్రేవో 4–0–42–1. 
చదవండి: IPL 2022: థర్డ్‌ అంపైర్‌కు మతి భ్రమించిందా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top