IPL 2022 Auction: రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను లాక్కొన్నారు.. పంజాబ్‌, హైదరాబాద్‌ లబోదిబో!

IPL 2022 Auction: PBKS SRH Complaint To BCCI About Lucknow Franchise Reports - Sakshi

లక్నో ఫ్రాంఛైజీ తీరుపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన పంజాబ్‌, హైదరాబాద్‌

IPL 2022 Auction: PBKS SRH Complaint To BCCI About Lucknow Franchise Reports: ఐపీఎల్‌-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్రీడాభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏ జట్టు ఎవరిని రీటైన్‌ చేసుకుంటుంది, వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలుకుతాడు అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే... రీటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించే తరుణం ఆసన్నమైన వేళ.. వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వనున్న లక్నో ఫ్రాంఛైజీపై ఆరోపణలు వెలుగుచూశాయి.

కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను ప్రలోభాలకు గురిచేసి తమ జట్లను వీడేలా ఒప్పందాలు జరుగుతున్నాయంటూ పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు ఐపీఎల్‌లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అక్కర్లేదు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు) అందుకున్న ఘనత అతడి సొంతం. అయితే, బ్యాటర్‌గా రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

అయినప్పటికీ రాహుల్‌ వంటి స్టార్‌ ప్లేయర్‌ను వదులుకునేందుకు పంజాబ్‌ సిద్ధంగా లేదు. అయితే, లక్నో మాత్రం పెద్ద మొత్తమైనా చెల్లించి రాహుల్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికే బేరసారాలు మొదలుపెట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇక సన్‌రైజర్స్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ జట్టును వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడిని కూడా సొంతం చేసుకునేందుకు లక్నో ఆసక్తి చూపిస్తోందట.

ఈ నేపథ్యంలో పంజాబ్‌, హైదరాబాద్‌ యాజమాన్యాలు లక్నో ఫ్రాంఛైజీ వ్యవహారశైలిపై ఇప్పటికే బీసీసీఐకి మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ కథనం ప్రచురించింది.  ‘‘ఇప్పటివరకైతే లేఖా పూర్వకంగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే... లక్నో టీమ్‌ కొంతమంది ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేస్తోందని రెండు ఫ్రాంఛైజీలు మౌఖికంగా ఫిర్యాదు చేశాయి.

ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ఫర్వాలేదు. కానీ.. ప్రలోభాలకు గురిచేస్తే మాత్రం సహించబోము. జట్టును సమతుల్యం చేసుకునేందుకు ఇప్పటికే లీగ్‌లో పాల్గొంటున్న జట్లు ప్రయత్నిస్తుంటే.. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు’’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.  కాగా రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్‌ లిమిటెడ్‌ రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్‌ డాలర్లు) వెచ్చించి లక్నో జట్టును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్‌గానే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top