ఇలా అయితే ఐపీఎల్‌ నుంచి మొదటగా వెళ్లేది వాళ్లే

IPL 2021: Ojha Says No Communication RR Bowlers And Fielders Surprise Me - Sakshi

ముంబై: ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌‌ ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని.. బౌలర్లకు, ఫీల్డర్లకు మధ్య ఏ మాత్రం కమ్యునికేషన్‌ లేకుండానే మ్యాచ్‌ ఆడారని టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రగ్యాన్‌ ఓజా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఘోర పరాభవం చూసిన సంగతి తెలిసిందే. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ పడిక్కల్‌, కోహ్లిల సోరుతో పది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ అనంతరం రాజస్తాన్‌ టాపార్డర్‌ ప్రదర్శనపై ఓజా మండిపడ్డాడు.

''నిన్నటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అత్యంత చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ముఖ్యంగా వారి టాప్‌ ఆర్డర్‌ బలహీనంగా తయారైంది. టాప్‌ ఆర్డర్‌ బలంగా ఉంటేనే కదా.. మిడిల్‌ ఆర్డర్‌ నుంచి మంచి ప్రదర్శన వచ్చేది. 30 పరుగులలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టను శివమ్‌ దూబే, తెవాటియాలు తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారిద్దరు ఆడారు గనుకనే కనీసం పోరాడే స్కోరును నమోదు చేయగలిగింది. శివమ్‌ దూబే ఔటైన తీరు నాకు అస్సలు నచ్చలేదు. అతను ఆ షాట్‌ను ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాలేదు. దూబే అవుట్‌ అవ్వడానికి ముందు ఆ జట్టు కోచ్‌ సంగక్కర వచ్చి వెళ్లాడు. అతను ఏం చెప్పాడో.. దూబే ఏం విన్నాడో వారిద్దరికే తెలియాలి. ఇక ఆర్‌సీబీ బ్యాటింగ్‌ సమయంలో బౌలర్లు, ఫీల్డర్లకు పొంతన లేకుండా పోయింది. వీళ్లు కనీసం కమ్యునికేషన్‌ లేకుండా మ్యాచ్‌ను ఆడేశారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం లీగ్‌ నుంచి మొదటగా నిష్క్రమించేది రాజస్తాన్‌ రాయల్స్‌.. '' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రగ్యాన్‌ ఓజా ఐపీఎల్‌లో 92 మ్యాచ్‌లాడి 82 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్‌ సిరాజ్‌ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్‌ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు.  178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించాడు. కాగా కోహ్లి ఇదే మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌లో 6వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. 
చదవండి: ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్‌ చేసుకున్నారు..
పడిక్కల్‌కు సాయం చేసిన బట్లర్‌.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top