Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్‌ కార్తీక్‌

IPL 2021 KKR Vs DC: Dinesh Karthik On Ashwin Eoin Morgan Altercation - Sakshi

Dinesh Karthik On R Ashwin and Eoin Morgan Altercation: ‘‘రాహుల్‌ త్రిపాఠి బంతి విసిరాడు. అది రిషభ్‌ పంత్‌ను తాకి.. కిందపడింది. ఇంతలో అశ్విన్‌ పరుగు కోసం పంత్‌ను ఆహ్వానించాడు. ఇద్దరూ పరుగు తీశారు. అయితే మోర్గాన్‌కు ఇది నచ్చలేదు. నిజానికి... బాల్‌ బ్యాటర్‌ లేదంటే ప్యాడ్‌ను తాకిన తర్వాత.. పరుగు తీయడం సరికాదు. ఇది.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అతడు భావిస్తాడు. అందుకే ఇదంతా’’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌.. మంగళవారం నాటి మ్యాచ్‌కు సంబంధించిన గొడవ గురించి వివరించాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. 

తద్వారా పంత్‌సేన జైత్రయాత్రకు బ్రేక్‌ పడినట్లయింది. అయితే, నిన్న షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండూ కూడా ఢిల్లీ ఆటగాడు అశ్విన్‌తో ముడిపడినవే కావడం గమనార్హం. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌.. ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన 19వ ఓవర్‌లో.. పంత్‌ను రనౌట్‌ చేసే అవకాశం చేజారింది. ఓవర్‌ ఐదో బంతిని పంత్‌ హిట్‌ చేసి పరుగు తీశాడు. అయితే, త్రిపాఠి వేసిన బంతిని..  అందుకోవడంలో అయ్యర్‌ విఫలం అయ్యాడు. 

అదే సమయంలో రెండో పరుగు కోసం అశ్విన్‌ పిలవడం.. ఈ క్రమంలో అనుకోకుండా అయ్యర్‌కు అడ్డురావడం జరిగింది. ఈ నేపథ్యంలో.. తదుపరి ఓవర్‌లో కేకేఆర్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అశ్విన్‌తో గొడవకు దిగడం గమనార్హం. ఇంతలో కెప్టెన్‌ మోర్గాన్‌ కూడా అతడికి మద్దతుగా ముందుకు వచ్చాడు. దీంతో.. గొడవ పెద్దదయ్యేలా కనిపించింది. అయితే, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ వచ్చిన అశ్విన్‌ను దూరంగా తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. 

ఈ విషయాల గురించి దినేశ్‌ కార్తిక్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. 19వ ఓవర్‌లో బంతి పంత్‌ను తాకిన తర్వాత కూడా రెండో పరుగు తీయడం క్రీడాస్ఫూర్తిని విస్మరించడం వంటిదేనని భావించి, మోర్గాన్‌ కలుగజేసుకున్నాడని పేర్కొన్నాడు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్‌ చేసిన పని గురించి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు.  అయితే, కేవలం ఇది తన అభిప్రాయం మాత్రమే అని దినేశ్‌ కార్తిక్‌ స్పష్టం చేశాడు. ఏదేమైనా.. తన జోక్యం వల్ల గొడవ సద్దుమణిగినందుకు సంతోషంగా ఉందని, ఇప్పుడు అంతా సర్దుకుందని పేర్కొన్నాడు.

చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్‌ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top