KKR Vs DC: ఢిల్లీ జైత్రయాత్రకు కేకేఆర్‌ అడ్డుకట్ట.. 3 వికెట్ల తేడాతో విజయం

IPL 2021 2nd Phase KKR Vs DC Match Live Updates And Highlights - Sakshi

ఢిల్లీ జైత్రయాత్ర కేకేఆర్‌ అడ్డుకట్ట.. 3 వికెట్ల తేడాతో విజయం 
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కేకేఆర్‌ అడ్డుకట్ట వేసింది. డీసీ నిర్ధేశించిన128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ.. స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా(27 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి దాకా క్రీజ్లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు.  20 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో నరైన్‌, నాలుగు పరుగుల తర్వాత సౌథీ(3) ఔటైనప్పటికీ.. రాణా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా బౌండరీ బాది కేకేఆర్‌ను గెలిపించాడు. దీంతో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 3 వికెట్లు, నోర్జే, అశ్విన్‌, లలిత్‌ యాదవ్‌, రబాడా తలో వికెట్‌ పడగొట్టారు.  

6వ వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. నరైన్‌(21) ఔట్‌
20 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో నోర్జే బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి సునీల్‌ నరైన్‌(10 బంతుల్లో 21; ఫోర్‌, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. అప్పటికే ఢిల్లీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతిలో మరో నాలుగు వికెట్లుండడంతో కేకేఆర్‌ గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది. 

కష్టాల్లో కేకేఆర్‌.. 96 పరుగులకే 5 వికెట్లు
128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ జట్టు 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 15వ ఓవర్‌ నాలుగో బంతికి దినేశ్‌ కార్తీక్‌(14 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను ఆవేశ్‌ ఖాన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. క్రీజ్లో నితీశ్‌ రాణా(29), సునీల్‌ నరైన్‌ ఉన్నారు. 

కేకేఆర్‌కు భారీ షాక్‌.. 67 పరుగులకే 4 వికెట్లు డౌన్‌
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ సైతం వడివడిగా వికెట్లు కోల్పోతుంది. రబాడా వేసిన 11వ ఓవర్‌ ఆఖరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ క్యాచ్‌ పట్టడంతో శుభ్‌మన్‌ గిల్‌(33 బంతుల్లో 30; ఫోర్‌, 2 సిక్సర్లు) ఔట్‌ కాగా.. అదే స్కోర్‌ వద్ద ఆ మరుసటి ఓవర్‌ రెండో బంతికి అశ్విన్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ డకౌటయ్యాడు. దీంతో కేకేఆర్‌ జట్టు 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్లో నితీశ్‌ రాణా(12), దినేశ్‌ కార్తీక్‌ ఉన్నారు.   


Photo Courtesy: IPL

కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌.. రాహుల్‌ త్రిపాఠి(9) ఔట్‌
ఆవేశ్‌ ఖాన్‌ వేసిన 6వ ఓవర్‌ ఐదో బంతికి స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ త్రిపాఠి(5 బంతుల్లో 9; సిక్స్‌) ఔటయ్యాడు. దీంతో కేకేఆర్‌ జట్టు 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో గిల్‌(19), నితీశ్‌ రాణా ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌..వెంకటేశ్‌ అయ్యర్‌(14) క్లీన్‌ బౌల్డ్‌
128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ జట్టు 5వ ఓవర్లో తొలి వికెట్‌ కోల్పోయింది. సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌(15 బంతుల్లో 14; 2 ఫోర్లు)ను లలిత్‌ యాదవ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 4.3 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 28/1. క్రీజ్‌లో గిల్‌(13), రాహుల్‌ త్రిపాఠి ఉన్నారు.


Photo Courtesy: IPL

నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఢిల్లీ.. కేకేఆర్‌ టార్గెట్‌ 128
ఓపెనర్లు స్టీవ్‌ స్మిత్‌(39), ధవన్‌(24) అందించిన శుభారంభాన్ని ఢిల్లీ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. పంత్‌(36 బంతుల్లో39; 4 ఫోర్లు) మినహా మిడిలార్డర్‌ మొత్తం విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 127 పరుగుల నామమాత్రపు స్కోర్‌ మాత్రమే చేయగలిగింది. సౌథీ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అశ్విన్‌(9) ఔట్‌ కాగా, రెండో బంతికి పంత్‌(39), ఆఖరి బంతికి ఆవేశ్‌ ఖాన్‌(5) రనౌటయ్యారు. ఈ ఓవర్లో సౌథీ కేవలం 7 పరుగులు మాత్రమే ఇవ్వగా.. ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయింది. కేకేఆర్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, నరైన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సౌథీకి ఓ వికెట్‌ దక్కింది.  


Photo Courtesy: IPL

4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
అప్పటివరకు నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన ఢిల్లీ జట్టు మూడు వరుస ఓవర్లలో నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ 5వ బంతికి హెట్‌మైర్‌(5 బంతుల్లో 4) వికెట్‌ను కోల్పోయిన డీసీ.. నరైన్‌ వేసిన ఆ మరుసటి ఓవర్‌ మూడో బంతికి లలిత్‌ యాదవ్‌(0), వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన 15.3 ఓవర్లో అక్షర్‌ పటేల్‌(0) వికెట్లను సమర్పించుకుంది. ఫలితంగా 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 16 ఓవర్ల తర్వాత డీసీ స్కోర్‌ 98/6. క్రీజ్‌లో పంత్‌(21), అశ్విన్‌(5) ఉన్నారు.  

స్టీవ్‌ స్మిత్‌(39) క్లీన్‌ బౌల్డ్‌.. ఢిల్లీ మూడో వికెట్‌ డౌన్‌
రెండో దశ ఐపీఎల్‌-2021లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌(34 బంతుల్లో 39; 4 ఫోర్లు)ను ఫెర్గూసన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న స్మిత్‌.. భారీ షాట్‌ ఆడే క్రమంలో ఔటయ్యాడు. 12.2 ఓవర్ల తర్వాత డీసీ స్కోర్‌ 77/3. క్రీజ్లో పంత్‌(11), హెట్‌మైర్‌ ఉ​న్నారు. 


Photo Courtesy: IPL

శ్రేయస్‌ అయ్యర్‌(1) క్లీన్‌ బౌల్డ్‌.. ఢిల్లీ సెకెండ్‌ వికెట్‌ డౌన్‌
నునీల్‌ నరైన వేసిన 7వ ఓవర్‌ రెండో బంతికి ఇన్‌ ఫామ్ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(5 బంతుల్లో 1) ఔటయ్యాడు. బంతిని తప్పుగా అంచనా వేసిన అయ్యర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఫలితంగా డీసీ 40 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్లో స్టీవ్‌ స్మిత్‌(14), పంత్‌ ఉన్నారు.


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. ధవన్‌(24) ఔట్‌
ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ ఆఖరి బంతికి ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ క్యాచ్‌ పట్టడంతో ఢిల్లీ ఓపెనర్‌ ధవన్‌(20 బంతుల్లో 24; 5 ఫోర్లు) పెవిలియన్‌ బాట పట్టాడు. 5 ఓవర్ల తర్వాత డీసీ స్కోర్‌ 35/1. క్రీజ్‌లో స్టీవ్‌ స్మిత్‌(11), శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.


Photo Courtesy: IPL

షార్జా: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలైన డబుల్‌ హెడర్‌ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గాయం కారణంగా ఢిల్లీ స్టార్‌ ఓపెనర్‌ పృథ్వీ షా మ్యాచ్‌కు దూరం కాగా, ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ జట్టులోకి వచ్చాడు.

ముఖాముఖి పోటీ విషయానికొస్తే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 27 సార్లు తలపడగా.. కోల్‌కతా 14, ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రస్తుత సీజన్‌ తొలిదశలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో డీసీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ సీజన్‌ పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. డీసీ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా.. కేకేఆర్‌ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, టిమ్‌ సౌథీ, వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌.
ఢిల్లీ క్యాపిటల్స్: స్టీవ్‌ స్మిత్‌, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేష్ ఖాన్.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top