IPL 2021 Winner: కేకేఆర్‌పై ఘన విజయం.. చెన్నై ‘ఫోర్‌’ కొట్టేసింది!

IPL 2021 Final: CSK Beat KKR By 27 Runs Lift Trophy For 4th Time - Sakshi

IPL 2021 Winner CSK: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ‘ఫోర్‌’ కొట్టేసింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోని సేన నాలుగోసారి(2010, 2011, 2018, 2021) క్యాష్‌ రిచ్‌ లీగ్‌ విజేతగా అవతరించింది. విజయ దశమి నాడు అభిమానులకు గొప్ప బహుమతి ఇచ్చింది. తొమ్మిదోసారి ఫైనల్‌ చేరిన చెన్నై... సగర్వంగా నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక తొలి అంచెలో తడబడినా.. యూఏఈలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న మోర్గాన్‌ బృందం రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అదరగొట్టిన డుప్లెసిస్‌.. గైక్వాడ్‌ సైతం..
టాస్‌ గెలిచిన మోర్గాన్‌... ధోని సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో... ఈ సీజన్‌లో చక్కటి శుభారంభాలు అందించిన చెన్నై ఓపెనర్లు మరోసారి అదే ఫీట్‌ రిపీట్‌ చేశారు. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(27 బంతుల్లో 32 పరుగులు, 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) మెరుగైన ఆట తీరు కనబరచగా...  ఫాఫ్‌ డుప్లెసిస్‌(59 బంతుల్లో 86, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్బ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇక రాబిన్‌ ఊతప్ప మరోసారి మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మొయిన్‌ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై  3 వికెట్లు కోల్పోయి... 192 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో సునిల్‌ నరైన్‌కు రెండు, శివం మావికి ఒక వికెట్‌ దక్కాయి.

ఓపెనింగ్‌ జోడీ రాణించినా..
193 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌(51), వెంకటేశ్‌ అయ్యర్‌(50) మంచి ఆరంభాన్ని అందించారు. కానీ శార్దూల్‌ ఠాకూర్‌ మాయాజాలం, జడేజా అద్భుత ఫీల్డింగ్‌.. అన్నింటికీ మించి ధోని వ్యూహాల ముందు చతికిలపడ్డ కేకేఆర్‌కు చివరికి ఓటమి తప్పలేదు. నితీశ్‌ రాణా(0), సునిల్‌ నరైన్‌(2), కెప్టెన్‌ మోర్గాన్‌(4), దినేశ్‌ కార్తిక్‌(9), షకీబ్‌ అల్‌ హసన్‌(0), రాహుల్‌ త్రిపాఠి(2), లాకీ ఫెర్గూసన్‌(3) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

చివర్లో శివం మావి(20) వరుస షాట్లతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మూడోసారి టైటిల్ గెలవాలన్న కేకేఆర్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.  2012 నాటి ఫలితాన్ని పునరావృతం చేద్దామని భావించిన కోల్‌కతాకు 2021 ఫైనలో భంగపాటు తప్పలేదు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చహర్‌ 1, జోష్‌ హాజిల్‌వుడ్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌ 3, జడేజా రెండు, బ్రావో ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. 

చదవండి: గోల్డెన్‌ డక్‌ విషయంలో నితీష్‌ రాణా చెత్త రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top