Dhoni As Team India Mentor Is Greatest Decision Says Vaughan: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఇంగ్లండ్ మాజీ సారధి మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని.. అపార క్రికెట్ పరిజ్ఞానం కలిగిన ఆటగాడని, ఆ చాణక్య బుర్ర అవసరం టీమిండియాకు ఎంతైనా ఉందని, ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ధోని లాంటి దిగ్గజం జట్టుతో కలిసి డ్రెసింగ్ రూమ్‌లో ఉండటం అదనపు బలమని పేర్కొన్నాడు. టీమిండియా మెంటార్‌గా ధోనిని నియమించడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న అతి గొప్ప నిర్ణయమని, టీమిండియాకు ధోని చాణక్య బుర్ర తోడైతే టీ20 ప్రపంచకప్ తప్పక గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.
పరిస్థితులను అంచనా వేయడంలో ధోని మాస్టర్ అని, జట్టు మైదానంలో ఉన్న సమయంలో మహీ లాంటి వ్యూహకర్త డగౌట్‌లో ఉంటే అంతకు మించిన సౌలభ్యం మరొకటి ఉండదని అన్నాడు. ధోని వ్యూహాలు చాలా వరకు సక్సెస్ అవుతాయని, త్వరలో జరుగబోయే ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న భారత్‌కు ఇది తప్పక మేలు చేస్తుందని తెలిపాడు. కాగా, టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా మెంటార్‌గా ధోనిని నియమించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ రెండో దశలో ధోని నేతృత్వంలో సీఎస్‌కే వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విజైత్రయాత్రలో జట్టు కెప్టెన్ ధోనిదే కీలకపాత్ర. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ధోనీ తన చాకచక్య నిర్ణయాలతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. అంతకుముందు ఆర్సీబీ, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో సైతం ధోని తన చాణక్య బుర్రను ఉపయోగించి జట్టును గెలిపించాడు. ఫలితంగా పాయింట్ల పట్టికలో సీఎస్‌కే(16 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
చదవండి: మోర్గాన్‌లా చేయాల్సి వస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడిని..


