RCB Vs MI: హ్యాట్రిక్‌తో చెలరేగిన హర్షల్‌ పటేల్‌.. ఆర్సీబీ ఘన విజయం

IPL 2021 2nd Phase RCB Vs MI Match Live Updates And Highlights - Sakshi

హ్యాట్రిక్‌తో చెలరేగిన హర్షల్‌ పటేల్‌.. ఆర్సీబీ ఘన విజయం
ముంబై ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో హ్యాట్రిక్‌తో చెలరేగిన హర్షల్‌ పటేల్‌(4/17).. 19వ ఓవర్‌ తొలి బంతికి ఆడమ్‌ మిల్నే(0)ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో 111 పరుగుల వద్ద ముంబై ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా ఆర్సీబీ  54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ బౌలర్లు హర్షల్‌ పటేల్‌, చహల్‌(3/11), మ్యాక్స్‌వెల్‌(2/23), సిరాజ్‌(1/15) ధాటికి ముంబై 18.1 ఓవర్లలో ఆలౌటైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ(43), డికాక్‌(24) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. 

హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌
ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో ఆర్సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ మ్యాజిక్‌ చేశాడు. ఈ ఓవర్‌ తొలి బంతికి హార్ధిక్‌ పాండ్యా(6 బంతుల్లో 3)ను పెవిలియన్‌కు పంపిన హర్షల్‌.. ఆ తరువాత వరుస బంతుల్లో పోలార్డ్‌(10 బంతుల్లో 7), రాహుల్‌ చాహర్‌(0)లను కూడా ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. దీంతో 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ముంబై.. ఓటమి అంచున నిలిచింది. క్రీజ్‌లో ఆడమ్‌ మిల్నే, బుమ్రా ఉన్నారు.  

కష్టాల్లో ముంబై.. 97 పరుగులకే 5 వికెట్లు  డౌన్‌
సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌(9 బంతుల్లో 8) ఔటయ్యాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని కట్‌ చేయబోయి చహల్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ వెనుదిరిగాడు. దీంతో ముంబై 97 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో పోలార్డ్‌(2), హార్ధిక్‌ పాండ్యా ఉన్నారు.   

మ్యాక్సీ సూపర్‌ బౌలింగ్‌.. కృనాల్‌(5) క్లీన్‌ బౌల్డ్‌
ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతికి మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో కృనాల్‌ పాండ్యా(11 బంతుల్లో 5) క్లీన్‌ బౌల్డయ్యాడు.  13.1 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 93/4. క్రీజ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(6), పోలార్డ్‌ ఉన్నారు.  ఆర్సీబీ స్పిన్నర్లు చహల్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముంబై గెలుపుకు 36 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. 

మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై.. ఇషాన్‌ కిషన్‌(9) ఔట్‌
నాలుగు బంతుల వ్యవధిలో రెండు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్‌ ఆఖరి బంతికి మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ క్యాచ్‌ అందుకోడంతో రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, సిక్స్‌) ఔటవగా.. 11వ ఓవర్‌ మూడో బంతికి చహల్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ క్యాచ్‌ పట్టడంతో ఇషాన్‌ కిషన్‌(12 బంతుల్లో 9; ఫోర్‌) పెవిలియన్‌కు చేరాడు. 10.3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 81/3. క్రీజ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(1), కృనాల్‌ పాండ్యా ఉన్నారు.  


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై.. డికాక్‌(24) ఔట్‌
ధాటిగా ఆడుతున్న ముంబై జట్టుకు 6 ఓవర్‌లో బ్రేక్‌ పడింది. చహల్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ క్యాచ్‌ పట్టడంతో డికాక్‌(23 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఔటయ్యాడు. 6.4 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 57/1. క్రీజ్‌లో రోహిత్‌(18 బంతుల్లో 30; 5 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ ఉన్నారు.  

ధాటిగా ఆడుతున్న ముంబై ఓపెనర్లు.. 6 ఓవర్ల తర్వాత 56/0
166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. రోహిత్‌ శర్మ(17 బంతుల్లో 29; 5 ఫోర్లు),  డికాక్‌(20 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 56/0. 

ఆర్సీబీ భారీ స్కోర్‌ ఆశలకు గండి.. ముంబై టార్గెట్‌ 166 
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ముంబై బౌలర్‌ బుమ్రా గట్టి షాకిచ్చాడు. వరుస బంతుల్లో ఆర్సీబీ హార్డ్‌ హిట్టర్లు మ్యాక్స్‌వెల్‌(37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డివిలియర్స్‌(6 బంతుల్లో 11; ఫోర్‌, సిక్స్‌)ను ఔట్‌ చేసి భారీ స్కోర్‌ సాధిద్దామనుకున్న ఆర్సీబీ ఆశలకు గండి కొట్టాడు. ఆ తరువాత ఓవర్(ఆఖరి ఓవర్‌) రెండో బంతికే బౌల్ట్‌.. షాబాజ్‌ అహ్మద్‌(1)ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో ఒక్క పరుగు వ్యవధిలో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆఖరి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 

కోహ్లి(51) ఔట్‌.. ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌
సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్న ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే గత మ్యాచ్‌లో లాగే ఫిఫ్టి కొట్టిన వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆడమ్‌ మిల్నే బౌలింగ్‌లో సబ్‌సిట్యూట్‌ ఫీల్డర్‌ అంకిత్‌ రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 15.5ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 126/3. క్రీజ్లో మ్యాక్స్‌వెల్‌(34), డివిలియర్స్‌ ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. శ్రీకర్‌ భరత్‌(32) ఔట్‌
వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి ఆడుతున్న శ్రీకర్‌ భరత్‌(24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను 9వ ఓవర్‌ ఐదో బంతికి రాహుల్‌ చాహర్‌ బోల్తా కొట్టించాడు. సిక్సర్‌ బాది జోరుమీదున్నట్లు కనిపించిన భరత్‌.. మర భారీ షాట్‌ ఆడబోయి సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8.5 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 75/2. క్రీజ్‌లో కోహ్లి(38), మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు.  

రెండో ఓవర్‌లోనే ఆర్సీబీకి షాక్‌.. పడిక్కల్‌ డకౌట్‌
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి రెండో ఓవర్‌లోనే తొలి షాక్‌ తగిలింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ నాలుగో బంతికి పడిక్కల్‌.. వికెట్‌కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌటయ్యాడు. 1.4 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 7/1. క్రీజ్‌లో కోహ్లి(6), శ్రీకర్‌ భరత్‌ ఉన్నారు. 


Photo Courtesy: IPL

అబుదాబీ: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు మొదలుకానున్న  డబుల్‌ హెడర్‌ రెండో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై  ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ముంబై స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్‌ పాండ్యా సౌరభ్‌ తివారీ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 28 మ్యాచ్‌లు జరగ్గా.. బెంగళూరు 11, ముంబై 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. లీగ్‌ తొలి భాగంలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై కోహ్లీసేన 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఇక, పాయింట్ల విషయానికొస్తే.. ఇప్పటివరకు ఇరు జట్లు చెరి 9 మ్యాచ్‌లు ఆడగా.. ఆర్సీబీ 5, ముంబై 4 మ్యాచ్‌ల్లో నెగ్గి మూడు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, శ్రీకర్ భారత్ (కీపర్), కైల్ జేమీసన్, డేనియల్‌ క్రిస్టియన్‌, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top