Kagiso Rabada: రగ్బీ ప్లేయర్‌ నుంచి క్రికెటర్‌ దాకా.. ఆసక్తికర ప్రయాణం

Interesting Story Kagiso Rabada-Fall-In-Love With Cricket Leaving Rugby - Sakshi

కగిసో రబాడా.. దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్‌గా అందరికి సుపరిచితమే. తన ఫాస్ట్‌ బౌలింగ్‌తో జట్టును ఎన్నోసార్లు గెలిపించి కీలక బౌలర్‌గా ఎదిగాడు. మంచి వేగంతో బంతులు సంధించే రబాడ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో దిట్ట. తాజాగా  ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున తొలి మ్యాచ్‌ ఆడాడు.

గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రబాడా ఐపీఎల్‌లో వందో వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. సాహా వికెట్‌ తీయడం ద్వారా రబాడ ఈ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రబాడా క్రికెటర్‌ కాకపోయుంటే రగ్బీ ప్లేయర్ అయ్యేవాడంట. అతని గురించి మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రగ్బీతో కెరీర్‌ మొదలుపెట్టి ఆపై క్రికెటర్‌గా..
కగిసో రబాడా మొదట రగ్బీలో కెరీర్‌ను కొనసాగించాలనుకున్నాడు. కానీ అతను తన మొదటి ప్రేమను అంటే రగ్బీని వదులుకోవాల్సి వచ్చింది.  రగ్బీ ప్లేయర్‌ నుంచి కగిసో రబాడా క్రికెటర్‌గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. రబాడాకు చిన్నప్పటి నుంచి రగ్బీ అంటే ఆసక్తి. అతను పాఠశాల జట్టుతో రగ్బీ ఆడేవాడు.

కానీ ఒక్కసారి ఆఫ్ సీజన్ కారణంగా సరదాగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. తర్వాత ఎ లెవల్ క్రికెట్ టీమ్‌లోనూ, రగ్బీ టీమ్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. అందుకే ఈ ఆటగాడు రగ్బీని వదిలి క్రికెటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మే 25, 1995న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన రబాడా 2013లో దేశవాళీ క్రికెట్‌లో ఆడడం ప్రారంభించాడు. మరుసటి సంవత్సరం అంటే 2014లో అండర్-19 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు.

తన ప్రతిభను ప్రదర్శించేందుకు రబడకు ఇది పెద్ద వేదికగా మారింది. అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో తన స్పీడ్‌ మ్యాజిక్‌ను చూపించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై రబాడా 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ సంవత్సరం ప్రొటీస్ జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు.


Photo: IPL Twitter

తండ్రి డాక్టర్, తల్లి లాయర్ దీంతో.. కగిసో రబాడాకి ఆర్థికంగా ఇబ్బందులు లేవు. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది. అండర్-19 టి20 ప్రపంచకప్ తర్వాత అతను విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ టాల్ ఫాస్ట్ బౌలర్ 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన రబాడా అరంగేట్రం టీ20లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.

 
Photo: IPL Twitter

టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఒక సంవత్సరం తర్వాత 2015లో రబాడా తన వన్డే అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో.. రబాడా 3 మెయిడిన్లు బౌలింగ్ వేసి 8 ఓవర్లలో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టాడు. ఇక కగిసో రబడ ఐపీఎల్ లో 2022 సంవత్సరంలో 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీయగా, 2021 సంవత్సరంలో 15 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రబడ అత్యుత్తమ ప్రదర్శన 2020లో వచ్చింది. ఈ సీజన్ లో 17 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top