#Neeraj Chopra:13 ఏళ్ల వయస్సులోనే ఎన్నో అవమానాలు.. అయినా వరల్డ్‌ ఛాంపియన్‌! నీరజ్‌ 'బంగారు' కథ

Inspirational Story of World Athletics Championship gold medlist - Sakshi

చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌ను మరవకముందే విశ్వవేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్‌ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లొ 88.17 మీటర్ల త్రోతొ పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. తద్వారా వరల్డ్‌  అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర పుటలకెక్కాడు.

కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఎన్నో ఘనతలను నిరాజ్‌ అందుకున్నాడు. అంతకుముందు 2021 టోక్యో ఒలిపింక్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు ఈ బల్లెం వీరుడు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రపంచ క్రీడా వేదికపై సత్తా చాటుతున్న నీరజ్.. భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటున్నాడు.

ఎన్నో అవమానాలు..
నీరజ్‌ డిసెంబర్ 24, 1997న హర్యానాలోని పానిపట్‌ జిల్లాలోని ఖందార్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. నీరజ్‌ది ఒక రైతు కుటుంబం. నీరజ్‌కు ఇద్దరి సోదరిలు కూడా ఉన్నారు. అయితే నిరాజ్‌ తన చిన్నతనంలో దీర్ఘకాయత్వంతో బాధపడ్డాడు. 13 ఏళ్ల వయస్సులోనే నీరాజ్‌ 80 కేజీల బరువు కలిగి ఉన్నాడు. 

ఈ క్రమంలో అతడిని అందరూ హేళన చేసేవారు. ఆ గ్రామంలో పిల్లలు అయితే ఏకంగా  సర్పంచ్, సర్పంచ్‌ అని పిలిచే వారు. కానీ నిరాజ్‌ వాటిన్నటిని పట్టించుకోలేదు. జీవితంలో ఏదైనా సాధించి అవమానాలు ఎదుర్కొన్న చోటే శబాష్‌ అనిపించుకోవాలని నీరజ్‌ అప్పుడే నిర్ణయించుకున్నాడు.

అలా మొదలైంది..
అందరూ తన కొడుకును హేళన చేయడంతో తండ్రి సతీష్‌ కుమార్‌ చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో నిరాజ్‌ను వ్యాయమం చేసేందుకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని రోజు సతీష్‌ కుమార్‌ పానిపట్‌లోని శివాజీ స్టేడియంకు తీసుకువెళ్లేవాడు. అయితే వరల్డ్‌ఛాంపియన్‌గా ఎదిగిన నీరాజ్‌ ప్రయాణానికి అక్కడే బీజం పడింది.

శివాజీ మైదానంలో బళ్లెం వీరుడు బంగారు కథ మొదలైంది. శివాజీ స్టేడియంలో కొంత మంది అబ్బాయిలు జావెలిన్ త్రో ప్రాక్టీస్‌ చేయడం నీరజ్‌ చూశాడు. దీంతో తన కూడా జావెలిన్ పట్టాలని నిర్ణయించుకున్నాడు. నీరజ్‌కు జావిలిన్‌  త్రోపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుండడంతో అతడి తండ్రి పానిపట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో చేర్పించాడు.

అతడి కోచింగ్‌లో..
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో జావెలిన్ త్రోయర్ ట్రైనర్‌  జైవీర్ చౌదరి... నీరజ్ ప్రతిభను గుర్తించాడు. మొదటి ప్రయత్నంలోనే నిరాజ్‌ ఎటువంటి ప్రాక్టీస్‌ లేకుండా 40 మీటర్లు విసిరడం చూసి జైవీర్ చౌదరి ఆశ్చర్యపోయాడు. జైవీర్ చౌదరి శిక్షణలో నీరజ్ మరింత రాటుదేలాడు.

జైవీర్ చౌదరి దగ్గర ఏడాది శిక్షణ తర్వాత  పంచకులలోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేరాడు. అక్కడ కూడా నీరజ్ తన టాలెంట్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 2012లో లక్నోలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్‌ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే నీరాజ్‌కు తొలి జాతీయ పతకం. అక్కడ నుంచి నీరాజ్‌ వెనుక్కి తిరిగి చూడలేదు.

ఎన్నో ఘనతలు..
అనంతరం 2016లో ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో కూడా నీరజ్‌ సత్తాచాటాడు. స్వర్ణ పతకం గెలిచి అందరి నీరాజనాలను అందుకున్నాడు. అదే విధంగా 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు.

ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్‌  నిలిచాడు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో స్వర్ణంతో మెరిశాడు.

అవార్డులు, పురస్కారాలు 
భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును 2021లో, 2018లో అర్జున అవార్డు, 2022లో పద్శ శ్రీ అవార్డును అందుకున్నాడు. ఆర్మీలో అందించిన సేవలకు గుర్తింపుగాచోప్రాకు 2022లో పరమ్‌ విశిష్ట్‌ సేవా పతకం, 2020లో విశిష్ట్‌ సేవా పతకాలు వచ్చాయి.
చదవండి: World Athletics Championships: నీరజ్‌ స్వర్ణ చరిత్ర

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top