Shaili Singh: సెంటి మీటర్‌ తేడాతో స్వర్ణం చేజారె!

Indias Shaili Singh clinches silver in womens long jump - Sakshi

లాంగ్‌జంప్‌లో శైలీ సింగ్‌కు రజతం

ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

నైరోబి: ఒకే ఒక సెంటిమీటర్‌ దూరం భారత అథ్లెట్‌ శైలీ సింగ్‌ను స్వర్ణానికి దూరం చేసింది. ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ (అండర్‌–20) చాంపియన్‌షిప్‌లో ఆమె రజతం గెలిచినా... వెంట్రుకవాసిలో పసిడి దక్కకపోవడమనేది అథ్లెట్‌ను బాగా నిరాశపరిచే అంశం. కెన్యా రాజధానిలో ఆదివారం ముగిసిన ఈ జూనియర్‌ మెగా ఈవెంట్‌లో లాంగ్‌జంపర్‌ శైలీ ఆదివారం ఫైనల్స్‌లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 12 మంది పోటీపడిన మహిళల లాంగ్‌జంప్‌ ఫైనల్లో స్వీడన్‌కు చెందిన మజ అస్కగ్‌ 6.60 మీటర్ల దూరం దూకి బంగారు పతకం సాధించింది. (మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్‌ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా)

భారత లాంగ్‌జంపర్‌ శైలీ కూడా తానేం తక్కువ కాదని 6.59 మీటర్ల దూరం దూకింది. అర అంగుళం కంటే తక్కువ తేడాతో బంగారాన్ని కోల్పోయింది. తొలి, రెండో ప్రయత్నంలో ఆమె 6.34 మీ. దూరాన్ని నమోదు చేసింది. రెండో ప్రయత్నం ముగిసే సరికి హొరియెలొవా (6.50 మీ.; ఉక్రెయిన్‌) ఆధిక్యంలో నిలువగా, ఎబొసెలె (6.46మీ.; స్పెయిన్‌), శైలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రయత్నం (6.59 మీ.) శైలీని స్వర్ణావకాశానికి దగ్గర చేసింది. అప్పటికి అస్కగ్‌ (6.44 మీ.) పతకం బరిలోకి రానేలేదు. కానీ నాలుగో ప్రయత్నం అస్కగ్‌ (6.60 మీ.)ను చాంపియన్‌గా చేస్తే, భారత అథ్లెట్‌ 4, 5 ప్రయత్నాలు ఫౌల్‌ అయ్యాయి. ఆఖరి ఆరో ప్రయత్నం సఫలమైనా... 6.37 మీటర్ల దూరమే దూకింది. దీంతో చివరకు రజతమే ఖాయమైంది. ఉక్రెయిన్‌ అథ్లెట్‌ మరియా హొరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది.  చదవండి: ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నుమూత

మహిళల రిలేలో నాలుగో స్థానం
తెలుగమ్మాయి కుంజా రజిత భాగంగా ఉన్న 4 X 400 మీటర్ల రిలేలో భారత జట్టుకు నాలుగో స్థానం దక్కింది. మహిళల ఫైనల్లో రజిత, ప్రియా మోహన్, పాయల్‌ వోహ్రా, సమ్మీలతో కూడిన జట్టు పోటీని 3 నిమిషాల 40.45 సెకన్లలో పూర్తి చేసింది. ఇందులో నైజీరియా అమ్మాయిలు 3 ని.31.46 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలిస్తే, జమైకా జట్టు (3ని.36.57 సె.) రజతం, ఇటలీ బృందం (3ని.37.18 సె.) కాంస్యం గెలుపొందింది. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో స్వల్పతేడాతో భారత అథ్లెట్‌ డొనాల్డ్‌ మకిమయిరాజ్‌ (15.82 మీ.) కాంస్య పతకం కోల్పోయాడు.

ఇతని కంటే మూడు సె.మీ.దూరం దూకిన సైమన్‌ గోర్‌ (15.85 మీ.; ఫ్రాన్స్‌)కు కాంస్యం లభించగా, మకిమయిరాజ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇందులో గాబ్రియెల్‌ (16.43 మీ.; స్వీడెన్‌), హిబెర్ట్‌ (16.05 మీ.; జమైకా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మహిళల 5000 మీ. ఫైనల్లో అంకిత నిరాశపరిచింది. పది మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో ఆమె (17 ని.17.68 సెకన్లు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో 1 రజతం, 2 కాంస్యాలతో భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలను ముగించింది.

నేను 6.59 మీటర్ల తర్వాత ఇంకాస్త దూరాన్ని నమోదు చేయాల్సింది. స్వర్ణం గెలిచే అవకాశాలు ఇంకా మూడు ప్రయత్నాల రూపంలో ఉన్నా... అనుకున్నది సాధించలేకపోయాను. నా తల్లి పసిడిపైనే కన్నేయాలి.  జాతీయ గీతాన్ని వినిపించాలని చెప్పింది. అలా కుదరకపోవడం నన్ను బాధించింది. నాకు ఇంకా 17 ఏళ్లే. మరో జూనియర్‌ ఈవెంట్‌లో తలపడే అవకాశం ఉంది.  ఆసియా గేమ్స్, కామన్వెల్త్‌ గేమ్స్‌ కూడా జరగనుండటంతో మరింత మెరుగైన ప్రదర్శనతో స్వర్ణాన్ని సాకారం చేసుకుంటా’ 

– శైలీ సింగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top