టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్, వరుసగా రెండు పొట్టి ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న టీమిండియాకు ఏమైంది? తమకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్‌లో ఎందుకు విఫలమవుతోంది? ఒకప్పుడు పసికూనలను ఆటాడుకున్న భారత్,..ఇప్పుడు ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో సైతం ఘోర పరాభవాన్ని మూట కట్టుకుని అబాసుపాలైంది. ఐర్లాండ్ టూర్‌లో ఎదురైన ఓటముల నుంచి టీమిండియా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు.

ఇంగ్లండ్ గడ్డపై అదే తీరును భారత్ కొనసాగిస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో మెన్ ఇన్ బ్లూ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. అసలు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ సరికొత్త ‘టమిండియా’ ఎందుకు తడబడుతోంది? లోపాలు ఎక్కడున్నాయి? వాటిపై ఓ లుక్కేద్దాం.
కెప్టెన్సీ మార్పు కొంపముంచిందా?
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ముందు భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి మాత్రమే కాకుండా జట్టు నుంచే సూర్యను తప్పించింది. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు భారత టీ20 జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విజయవంతమైన అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా టీమిండియాను అదేవిధంగా నడిపిస్తాడని అంతా భావించారు. కానీ అయ్యర్ ఆరంభంలోనే అందరి అంచనాలను తారు మారు చేశాడు.
కెప్టెన్‌గా తన తొలి మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి చవిచూశాడు. అయితే సూర్య విషయానికి వస్తే.. అతడి ఫామ్ దిగజారిన మాట వాస్తవే. కానీ కెప్టెన్‌గా మాత్రం అతడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ సుమారు 80 శాతం విజయాలను సాధించింది.
ఆసియాకప్, ప్రపంచకప్‌లతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి ప్రధాన టీ20 సిరీస్‌లో కూడా భారత్ గెలుపొందింది. దీంతో ఇప్పుడు సూర్యను అంతా గుర్తు చేసుకుంటున్నారు. సూర్య వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో కనీసం మూడో టీ20లోనైనా అయ్యర్ కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
సరిపోని స్కోర్లు.. స్ట్రైక్ రేట్ పెంచాల్సిందే
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 190 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. ఆధునిక టీ20 క్రికెట్‌లో అది ఏ మాత్రం సరిపోదని మరోసారి రుజువైంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెప్పినట్లు, ఈ మ్యాచ్‌లో భారత్ మరో 20 పరుగులు తక్కువగా చేసింది.
అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోతున్నారు. అభిషేక్ శర్మ తనదైన శైలిలో పవర్‌ప్లేలో దుమ్ములేపుతుంటే.. ఆ తర్వాత రన్‌రేట్‌ను అదే వేగంతో కొనసాగించడంలో మన బ్యాటర్లు విఫలమవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్‌లో కూడా ఇదే జరిగింది.
మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకునే క్రమంలో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతున్నారు. దీంతో స్కోర్ వేగం తగ్గి భారీ టార్గెట్‌లను ప్రత్యర్ధి ముందు భారత్ ఉంచలేకపోతుంది. కచ్చితంగా భారత బ్యాటర్లు తమ స్ట్రైక్ రేట్ పెంచాల్సిందే.
తేలిపోతున్న బౌలర్లు
మరోవైపు భారత బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పరుగులను కట్టడి చేయలేక తేలిపోతున్నారు. మాంచెస్టర్ టీ20లో కూడా అదే జరిగింది. 190 పరుగులను డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లు స్వీప్‌లు, రివర్స్ స్పీప్‌లు ఆడుతుంటే.. మన బౌలర్లు కనీసం లెంగ్త్‌ను కూడా మార్చలేదు.
కీలక సమయాల్లో చెత్త బంతులు వేసి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించారు. అర్ష్‌దీప్ మినహా ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లలో విజయం సాధించాలంటే కచ్చితంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిందే. లేదంటే యూకే పర్యటనలో మరో సిరీస్ ఓటమి తప్పదు.


