8 వికెట్ల తేడాతో సఫారీ జట్టు ఘన విజయం

India Womens Team Lost To South Africa In first ODI Held In Lucknow - Sakshi

లక్నో: 5 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు శుభారంభం లభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక జట్టు 8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 177 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్‌ మిథాలి రాజ్‌ (85 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్‌), వైస్‌ కెప్టెన్‌ హర్మాన్‌ప్రీత్‌కౌర్‌ (41 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించడంతో భారత్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత జట్టులో దీప్తి శర్మ (46 బంతుల్లో 27; 3 ఫోర్లు), మంధాన (20 బంతుల్లో 14; 3 ఫోర్లు), పూనమ్‌ రౌత్‌ (29 బంతుల్లో 10; ఫోర్‌)లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సఫారీ బౌలర్ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (10-3-28-3) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు మ్లాబా(2/41), కాప్‌ (1/25), ఖాకా (1/29), కెప్టెన్‌ లస్‌ (1/23)లు రాణించారు.

ఆనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. లిజెల్‌ లీ (122 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, సిక్స్‌), వొల్‌వార్డ్డ్ (110 బంతుల్లో 80; 12 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో 40.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో జులన్‌ గోస్వామికి (2/38) మాత్రమే వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు 3 కీలకమైన వికెట్లు తీసుకున్న షబ్నిమ్‌ ఇస్మాయిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా (మార్చి 9) మంగళవారం జరుగనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top