‘పింక్‌ టెస్టు’ బరిలో మహిళలు

India women should play domestic pink-ball tournament  - Sakshi

తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడనున్న భారత జట్టు  

ముంబై: భారత మహిళల క్రికెట్‌ జట్టు తమ 45 ఏళ్ల టెస్టు మ్యాచ్‌ చరిత్రలో ఇప్పటి వరకు 36 టెస్టులు ఆడింది. జూన్‌ 16నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ జట్టుకు 37వది అవుతుంది. దీని తర్వాత తొలి సారి మన టీమ్‌ మిథాలీ రాజ్‌ నాయకత్వంలో డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ ఆడటం ఖాయమైంది. సెప్టెంబర్‌ 30నుంచి పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టును ‘పింక్‌ బాల్‌’తో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా పింక్‌ బాల్‌ టెస్టు అవకాశం కల్పించినట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు పర్యటన షెడ్యూల్‌ను ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు (సీఏ) ఖరారు చేసింది. సెప్టెంబర్‌ 19, 22, 24 తేదీల్లో వన్డేలు...అక్టోబర్‌ 7, 9, 11 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండింటి మధ్య ఏకైక టెస్టును నిర్వహిస్తారు. మహిళల క్రికెట్‌లో గతంలో ఒకే ఒక డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ జరిగింది. 2017లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య సిడ్నీలో జరిగిన ఈ టెస్టు డ్రాగా ముగిసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top