
ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఐదు పతకాలు
ఏథెన్స్ (గ్రీస్): అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారత ‘పట్టు’ చాటుకుంటూ... ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళా రెజ్లర్లు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 43 కేజీల విభాగంలో రచన... 65 కేజీల విభాగంలో అశ్విని విష్ణోయ్ బంగారు పతకాలు సొంతం చేసుకోగా... 57 కేజీల విభాగంలో మోనీ, 73 కేజీల విభాగంలో కాజల్ రజత పతకాలు గెలిచారు. 49 కేజీల విభాగంలో కోమల్ వర్మ కాంస్య పతకాన్ని హస్తగతం చేసుకుంది.
గురువారం జరిగిన ఫైనల్స్‌లో రచన 3–0తో జిన్ హువాంగ్ (చైనా)పై, అశ్విని 3–0తో ముఖాయో రఖిమ్‌జొనోవా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించారు. మద్‌ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్)తో జరిగిన తుది పోరులో మోనీ 5–6 పాయింట్ల తేడాతో... వెన్‌జిన్ కియు (చైనా)తో జరిగిన ఫైనల్లో కాజల్ 5–8 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్‌లో కోమల్ వర్మ 8–3 పాయింట్ల తేడాతో అన్‌హెలీనా బుర్కినా (రష్యా)పై గెలిచింది. మరోవైపు భారత్‌కే చెందిన యశిత (61 కేజీలు) స్వర్ణ పతకం కోసం... మనీషా (69 కేజీలు) కాంస్య పతకం కోసం ఈ రోజు పోటీపడనున్నారు.