అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకాల పంట  | Sakshi
Sakshi News home page

ఒకే రోజు 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సొంతం

Published Sun, Aug 15 2021 1:24 PM

India Win Three Gold Medals In World Archery Youth Championships - Sakshi

వ్రోక్లా (పోలాండ్‌): ఆర్చరీ యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. శనివారం మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలు గెలిచారు. కొరియా, చైనా ఆర్చర్ల గైర్హాజరీని భారత ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. క్యాడెట్‌ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో పర్ణీత్‌ కౌర్, ప్రియా గుర్జర్, రిధి వర్షిణిలతో కూడిన భారత బృందం 228–216తో టర్కీ జట్టును ఓడించింది. క్యాడెట్‌ పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో కుశాల్‌ దలాల్, సాహిల్‌ చౌదరీ, నితిన్‌లతో కూడిన భారత జట్టు 233–231తో అమెరికా జట్టుపై గెలిచింది.

కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో ప్రియా–కుశాల్‌ ద్వయం 155–152తో అమెరికా జోడీపై నెగ్గింది. క్యాడెట్‌ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ఫైనల్లో ప్రియా గుర్జర్‌ 136–139తో సెలెన్‌ రోడ్రిగెజ్‌ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. ఇదే విభాగం కాంస్య పతక పోరులో పర్ణీత్‌ 140–135తో హేలీ బౌల్టన్‌ (బ్రిటన్‌)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్‌ జూనియర్‌ మహిళల వ్యక్తిగత ఫైనల్లో సాక్షి 140–141తో అమందా మ్లినారిచ్‌ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకోగా... కాంపౌండ్‌ జూనియర్‌ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో రిషభ్‌ యాదవ్‌ 146–145తో సెబాస్టియన్‌ గార్సియా (మెక్సికో)పై గెలిచి కాంస్యం సాధించాడు. 

Advertisement
Advertisement