India vs South Africa 1st T20: ఆరంభం అదిరింది

India vs South Africa 1st T20: India beats Southafrica by eight wickets - Sakshi

తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్‌  ఘనవిజయం

నిప్పులు చెరిగిన అర్ష్‌దీప్‌ , చహర్‌

మెరిసిన సూర్య, రాహుల్‌

2న గువాహటిలో రెండో టి20  

తిరువనంతపురం: ప్రపంచకప్‌నకు ముందు చివరి టి20 సిరీస్‌ ఆడుతున్న భారత్‌ సులువైన శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత సీమర్లు దీపక్‌ చహర్‌ (2/24), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/32), హర్షల్‌ పటేల్‌ (2/26) నిప్పులు చెరిగారు. అనంతరం బ్యాటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ (33 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 51 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు.

దాంతో ఆసక్తికరంగా జరుగుతుందనుకున్న తొలిపోరు ఏకపక్షంగా ముగిసింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. కేశవ్‌ మహరాజ్‌ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. తర్వాత భారత్‌ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. సూర్య, రాహుల్‌ మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. సిరీస్‌ లో రెండో టి20 అక్టోబర్‌ 2న గువాహటిలో జరుగుతుంది.  

చహర్, అర్ష్‌దీప్‌ దడదడ
1 పరుగుకే వికెట్‌! బవుమా (0) క్లీన్‌బౌల్డ్‌. రెండో ఓవర్లో అదే పరుగు వద్ద రెండో వికెట్‌... డికాక్‌ (1)కూడా బౌల్డే! దీన్నుంచి తేరుకోకముందే ఆ ఓవర్లోనే రోసో (0), మిల్లర్‌ (0) ఇద్దరు వరుస బంతుల్లోనే డకౌట్‌. మూడో ఓవర్లో స్టబ్స్‌ (0) కూడా ఖాతా తెరువలేదు. 1, 3వ ఓవర్లు వేసిన దీపక్‌ చహర్‌ (2/2), ఒక్క రెండో ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ (3/7) పేస్‌కు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ కకావికలమైంది. జట్టు స్కోరు 9/5. ఇలా పది పరుగులైనా చేయకముందే సగం వికెట్లను కోల్పోయింది. మార్క్‌రమ్‌ (25; 3 ఫోర్లు, 1 సిక్స్‌), పార్నెల్‌ (24; 1 ఫోర్, 1 సిక్స్‌) ఇద్దరూ కాసేపు నిలబడటంతో కష్టంగా జట్టు స్కోరు 50 దాటింది. అనంతరం కేశవ్‌ మహరాజ్‌ కొట్టిన కాసిన్ని మెరుపులతో మొత్తానికి వంద పైచిలుకు స్కోరైతే చేయగలిగింది. ఇంత తక్కువ స్కోరులోనూ 19వ ఓవర్‌ పరుగందుకోవడం భారత శిబిరానికి మింగుడుపడని అంశం. అర్ష్‌దీప్‌ ఓవర్లో కేశవ్‌ మహరాజ్‌ 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు వచ్చాయి.  

సూర్య, రాహుల్‌ ఫిఫ్టీ–ఫిఫ్టీ
లక్ష్యం ఛేదించే క్రమంలో భారత టాపార్డర్‌కూ కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. సీనియర్లు రోహిత్‌ శర్మ (0),  కోహ్లి (3) దక్షిణాఫ్రికా పేసర్లు రబడ, నోర్జేలకు తలవంచారు. దీంతో భారత్‌ పవర్‌ప్లేలో 17 పరుగులే చేయగలిగింది. పిచ్‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్న మరో ఓపెనర్‌ రాహుల్, హిట్టర్‌ సూర్యకుమార్‌ జాగ్రత్త పడ్డారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడకుండా ఆచితూచి ఆడారు. సగం ఓవర్లు ముగిసినా భారత్‌ స్కోరు 50ని చేరుకోలేదు. 10 ఓవర్లలో 47/2 స్కోరే చేసింది. తర్వాత సూర్య బ్యాట్‌ ఝుళిపించాడు. రాహుల్‌ కూడా పరుగుల వేగం పెంచాడు. కుదిరిన బంతిని 4గా, చెత్త బంతిని 6గా దంచేశారు. దీంతో మరో 6.4 ఓవర్లలోనే మిగతా 63 పరుగుల్ని చకచకా చేసేసింది. లక్ష్యం చేరుకున్న 17వ ఓవర్లోనే సూర్య 33 బంతుల్లో, రాహుల్‌ 56 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.  

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) అర్ష్‌దీప్‌ 1; బవుమా (బి) దీపక్‌ చహర్‌ 0; రోసో (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 0; మార్క్‌రమ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్‌ పటేల్‌ 25; డేవిడ్‌ మిల్లర్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; స్టబ్స్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) చహర్‌ 0; పార్నెల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అక్షర్‌ 24; కేశవ్‌ (బి) హర్షల్‌ 41; రబడ (నాటౌట్‌) 7; నోర్జే (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106.
వికెట్ల పతనం: 1–1, 2–1, 3–8, 4–8, 5–9, 6–42, 7–68, 8–101.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–24–2, అర్ష్‌దీప్‌ సింగ్‌ 4–0–32–3, అశ్విన్‌ 4–1–8–0, హర్షల్‌ పటేల్‌ 4–0– 26–2, అక్షర్‌ పటేల్‌ 4–0–16–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 51; రోహిత్‌ శర్మ (సి) డికాక్‌ (బి) రబడ 0; విరాట్‌ కోహ్లి (సి) డికాక్‌  (బి) నోర్జే 3; సూర్యకుమార్‌ యాదవ్‌ (నాటౌట్‌) 50; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 110.
వికెట్ల పతనం: 1–9, 2–17.
బౌలింగ్‌: రబడ 4–1–16–1, పార్నెల్‌ 4–0–14–0, నోర్జే 3–0–32–1, షమ్సీ 2.4–0–27–0, కేశవ్‌ మహరాజ్‌ 3–0–21–0.

56: అంతర్జాతీయ టి20ల్లో ఎక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రాహుల్‌ 56 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. గతంలో ఈ రికార్డు గంభీర్‌ (54 బంతుల్లో ఆస్ట్రేలియాపై 2012లో) ఉంది.

732: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్యకుమార్‌ 21 మ్యాచ్‌లు ఆడి 732 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు శిఖర్‌ ధావన్‌ (689 పరుగులు; 2018లో) పేరిట ఉంది.

16: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో      భారత్‌కు ఎక్కువ విజయాలు (16) అందించిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు నెలకొల్పాడు. ధోని (2016లో 15 విజయాలు) పేరిట ఉన్న         రికార్డును రోహిత్‌ సవరించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top