త్వరలో భారత్‌-పాక్‌ టెస్ట్‌ సిరీస్‌..? | India Vs Pakistan Test Series Could Return After 18 Years As ICC Set For Crucial Ahmedabad Meeting, Read Story Inside | Sakshi
Sakshi News home page

త్వరలో భారత్‌-పాక్‌ టెస్ట్‌ సిరీస్‌..?

May 16 2026 4:20 PM | Updated on May 16 2026 4:39 PM

India vs Pakistan Test Series On The Cards? ICC Rings In Big Meeting

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌-పాక్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌లు మళ్లీ మొదలుకానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ దిశగా ఐసీసీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఐసీసీ నిర్వహించబోయే కీలక సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ భవిష్యత్‌ నిర్మాణంపై చర్చించేందుకు ఐసీసీ ఈ నెలాఖర్లో (మే 30, 31) అహ్మదాబాద్‌లో బోర్డు సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో టెస్టు క్రికెట్ విస్తరణతో పాటు భారత్‌, పాక్‌ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ పునరుద్ధరణ అంశం  ప్రధాన చర్చగా మారే అవకాశముంది. 

ఈ సమావేశాలకు బీసీసీఐ, పీసీబీ అధ్యక్షులు హాజరవుతారు. పీసీబీ చీఫ్‌ నఖ్వీ ఈ మీటింగ్‌కు వర్చువల్‌గా అటెండ్‌ అవుతాడని తెలుస్తుంది.

కాగా, భారత్‌, పాక్‌ మధ్య మళ్లీ టెస్టు సిరీస్ జరగొచ్చన్న చర్చ ఇరు దేశాల క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో నక్వీ మాట్లాడుతూ.. తదుపరి ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో అన్ని దేశాలతో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. దీంతో భారత్‌తో టెస్టు సిరీస్‌పై ఊహాగానాలు మరింత పెరిగాయి.

భారత్‌, పాక్‌ చివరిసారిగా 2007-08లో టెస్టు సిరీస్ ఆడాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఐసీసీ సమావేశాల్లో దీనిపై ప్రత్యక్ష నిర్ణయం వచ్చే అవకాశం లేకపోయినా, భవిష్యత్ చర్చలకు ఇది బాటలు వేయొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

12 జట్లు
టెస్టు క్రికెట్ భవిష్యత్‌పై అధ్యయనం చేసేందుకు ఐసీసీ గతేడాదే మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ రోజర్‌ ట్వోస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రస్తుతం ఉన్న 9 జట్ల నుంచి 12 జట్లకు విస్తరించాలని సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఆఫ్ఘనిస్తాన్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ వంటి జట్లకు కూడా డబ్ల్యూటీసీలో చోటు దక్కే అవకాశం ఉంటుంది.

ఒకే టెస్ట్‌తో సిరీస్‌
ఈ సమావేశాల్లో ఒకే టెస్టుతో సిరీస్ నిర్వహించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి డబ్ల్యూటీసీ సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు తప్పనిసరి. అయితే చిన్న క్రికెట్ బోర్డుల ఆర్థిక భారం తగ్గించేందుకు, మరిన్ని జట్లకు టెస్టు అవకాశాలు కల్పించేందుకు ఒకే టెస్టు సిరీస్ మోడల్‌పై ఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement