
దూకుడైన ఆటకు దూరంగా స్టోక్స్ బృందం
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 251/4
ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన నితీశ్ రెడ్డి
సెంచరీ ముంగిట రూట్
భారత్‌తో మూడో టెస్టు
ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్‌గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది.
లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది.
జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు.
బాగుందిరా... మామ!
ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్‌లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్‌లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది.
‘నీరు’గార్చిన రెండో సెషన్
భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్‌లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్‌లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు.
షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది.
రూట్ 99 బ్యాటింగ్
మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.
పంత్‌కు గాయం... జురేల్ కీపింగ్!
భారత డాషింగ్ వికెట్‌కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0.