breaking news
ENGvIND
-
IND vs ENG: 9 తీస్తారా... సిరీస్‌ను వదిలేస్తారా?
ఆఖరి పోరులో గెలవాలన్నా... సిరీస్‌ను సమం చేయాలన్నా... ఇప్పుడు భారత్ భారమంతా బౌలర్లమీదే ఉంది. బ్యాట్ పట్టి అర్ధశతకాలతో రెండో ఇన్నింగ్స్‌లో నిలబెట్టిన బౌలర్లే... ఇప్పుడు 9 వికెట్లు తీస్తే 2–2తో ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్‌ను సమం చేసిన గర్వంతో భారత్ స్వదేశానికి బయల్దేరుతుంది. ఇదే జరిగితే టీమిండియా టెస్టుల భవిష్యత్తుకు ఇక ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ ఫార్మాట్ నుంచి స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తప్పుకోవడంతో డీలాపడిన టెస్టు జట్టుకు నూతనోత్సాహాన్ని ఇంగ్లండ్ పర్యటన ఇచ్చినట్లు అవుతుంది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. భారత్ నెగ్గాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. మొత్తానికి సిరీస్‌లోని చివరి టెస్టులోనూ ఫలితం రావడం ఖాయమైంది. లండన్: కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్, కరుణ్ నాయర్... వీళ్లంతా స్పెషలిస్టు బ్యాటర్లు. కానీ కీలకమైన చివరి టెస్టులో బ్యాట్లెత్తారు. పేసర్ ఆకాశ్‌దీప్ సహా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు ప్రధానంగా బౌలర్లు. బౌలింగ్ ఆల్‌రౌండర్లు అయినా భారత బ్యాటింగ్ భారాన్ని మోశారు. ప్రధాన బ్యాటింగ్ బలగమే కనీసం 20 పరుగులైనా చేయలేకపోయిన చోటు ఈ ముగ్గురు అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... ఆకాశ్‌దీప్, జడేజా, సుందర్ తమ విలువైన అర్ధశతకాలతో ఈ టెస్టులో పోరాడే స్కోరును జత చేశారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 396 పరుగులు చేసింది. ఆకాశ్‌దీప్ (66; 12 ఫోర్లు), జడేజా (53; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు, అట్కిన్సన్ 3 వికెట్లు, ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట నిలిచే ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రాలీ (14)ని సిరాజ్ బౌల్డ్ చేయగా, డకెట్ (34 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఊహించని ఫిఫ్టీ... ఓవర్‌నైట్ స్కోరు 75/2 శనివారం మూడో రోజు ఆట రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు, ఓపెనర్ జైస్వాల్‌కు ఆకాశ్‌దీప్ కొండంత అండగా నిలిచాడు. ‘నైట్ వాచ్‌మన్’గా వచ్చిన ఆకాశ్‌దీప్ ఊహించని విధంగా ఆతిథ్య బౌలర్లను ఎదుర్కొన్నాడు. తొలిసెషన్లో తేలిగ్గానే అతని వికెట్‌ను దక్కించుకుందామనుకున్న ప్రధాన పేసర్లు అట్కిన్సన్, టంగ్‌లకు కొరకరాని కొయ్యగా మారాడు. మరోవైపు జైస్వాల్ కూడా అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును కదిలించాడు. మూడో వికెట్‌కు 100 పరుగులు జతయ్యాక 70 బంతుల్లో ఆకాశ్‌దీప్ టెస్టుల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతే జట్టు స్కోరు 177 వద్ద వెనుదిరిగాడు. జైస్వాల్ ‘శత’క్కొట్టినా... రెండో సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు ప్రభావం చూపెట్టారు. గిల్ (11), కరుణ్ నాయర్ (17)లను అట్కిన్సన్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో జైస్వాల్ ... జడేజా అండతో పరుగులు చక్కబెట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్ టెస్టుల్లో ఆరో సెంచరీని 127 బంతుల్లో పూర్తిచేసుకున్నాడు. భాగస్వామ్యం బలపడుతుండగానే టంగ్... జైస్వాల్ వికెట్ తీసి దెబ్బకొట్టాడు. ధ్రువ్ జురేల్ (34; 4 ఫోర్లు)తో కలిసి జడేజా జట్టు స్కోరును 300 దాటించాడు. 304/6 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ఆఖరి సెషన్ మొదలైన కొద్దిసేపటి తర్వాత జురేల్ అవుటవ్వగా... జడేజా, సుందర్ టీమిండియాను నడిపించారు. జడేజా 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే వికెట్‌ను సమరి్పంచుకోగా, సుందర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో మెరుపు ఫిఫ్టీని సాధించి స్కోరు పెంచే క్రమంలో అవుట్‌కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఓవర్టన్ (బి) టంగ్ 118; రాహుల్ (సి) రూట్ (బి) టంగ్ 7; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; ఆకాశ్‌దీప్ (సి) అట్కిన్సన్ (బి) ఓవర్టన్ 66; శుబ్‌మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్ 11; నాయర్ (సి) స్మిత్ (బి) అట్కిన్సన్ 17; జడేజా (సి) బ్రూక్ (బి) టంగ్ 53; ధ్రువ్ జురేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఓవర్టన్ 34; సుందర్ (సి) క్రాలీ (బి) టంగ్ 53; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్ 0; ప్రసిధ్‌కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (88 ఓవర్లలో ఆలౌట్) 396. వికెట్ల పతనం: 1–46, 2–70, 3–177, 4–189, 5–229, 6–273, 7–323, 8–357, 9–357, 10–396. బౌలింగ్: అట్కిన్సన్ 27–3–127–3, టంగ్ 30–4–125–5, ఓవర్టన్ 22–2–98–2, బెథెల్ 4–0–13–0, రూట్ 5–1–15–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (బ్యాటింగ్) 34; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 50. వికెట్ల పతనం: 1–50. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 5–1–15–0, ప్రసిధ్ 5–1–23–0, సిరాజ్ 3.5–0–11–1. -
ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు
మాంచెస్టర్: నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ ‘బజ్‌బాల్’ ఆటకు దిగినట్లుంది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లిద్దరూ వన్డేను తలపించే బ్యాటింగ్ దూకుడు కనిపించడంతో ఒక్క సెషన్లోనే 148 పరుగులు చేసింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను గాయపడిన రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు దిగి ఆదుకున్నాడు. టెస్టులో పోరాడేందుకు తనవంతు పరుగులు జతచేసే నిష్క్రమించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 114.1 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. రిషభ్ పంత్ (75 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శార్దుల్ ఠాకూర్ (88 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. లోయర్ ఆర్డర్‌పై ప్రతాపం చూపిన బెన్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (100 బంతుల్లో 94; 13 ఫోర్లు) అదరగొట్టారు. పోప్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు), రూట్ (11 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. జడేజా, అన్షుల్ కంబోజ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. తడబడిన మిడిలార్డర్ రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 264/4తో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ఆదిలోనే కీలకమైన వికెట్‌ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగే జతచేసిన జడేజా (20; 3 ఫోర్లు)ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో శార్దుల్‌కు వాషింగ్టన్ సుందర్ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. ఈ సెషన్ ముగిసే దశలో ఉండగా క్రీజులో పాతుకుపోయిన శార్దుల్‌ను స్టోక్స్ అవుట్ చేసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. తొలిరోజు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో 321/6 స్కోరు వద్ద వర్షం కాసేపు ఆటంకపరిచింది. అక్కడితోనే తొలి సెషన్ ముగిసింది. రెండో సెషన్లో పంత్, సుందర్ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ బలపడుతుండగానే స్టోక్స్ మళ్లీ గట్టిదెబ్బే కొట్టాడు. నాలుగు బంతుల వ్యవధిలో సుందర్ (90 బంతుల్లో 27; 2 ఫోర్లు), అన్షుల్ కంబోజ్ (0)లను అవుట్ చేశాడు. ఆర్చర్ బౌలింగ్‌లో 6 కొట్టిన పంత్... స్టోక్స్ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీతో 69 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే ఆర్చర్... పంత్‌తో పాటు బుమ్రా (4) వికెట్ పడగొట్టడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) డాసన్ 58; రాహుల్ (సి) క్రాలీ (బి) వోక్స్ 46; సుదర్శన్ (సి) కార్స్ (బి) స్టోక్స్ 61; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్ 12; పంత్ (బి) ఆర్చర్ 54; జడేజా (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 20; శార్దుల్ (సి) డకెట్ (బి) సోŠట్క్స్ 41; సుందర్ (సి) వోక్స్ (బి) స్టోక్స్ 27; అన్షుల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; బుమ్రా (సి) స్మిత్ (బి) ఆర్చర్ 4; సిరాజ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (114.1 ఓవర్లలో ఆలౌట్) 358. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 4–235, 5–266, 6–314, 7–337, 8–337, 9–349, 10–358. బౌలింగ్: వోక్స్ 23–5–66–1, ఆర్చర్ 26.1–3–73–3, కార్స్ 21–1–71–0, స్టోక్స్ 24–3–72–5, డాసన్ 15–1–45–1, జో రూట్ 5–0–19–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) సబ్–జురేల్ (బి) అన్షుల్ 94, ఒలీ పోప్ (బ్యాటింగ్) 20; రూట్ (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (46 ఓవర్లలో 2 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–166, 2–197. బౌలింగ్: బుమ్రా 13–4–37–0, అన్షుల్ కంబోజ్ 10–1–48–1, సిరాజ్ 10–0–58–0, శార్దుల్ 5–0–35–0, జడేజా 8–0–37–1. -
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ ఆచితూచి...
ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్ భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్ 99 బ్యాటింగ్ మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్‌కు గాయం... జురేల్ కీపింగ్! భారత డాషింగ్ వికెట్‌కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0.