ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు | ENG VS IND 4th Test Day 2: England team in strong position | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test Day 2: దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు

Jul 24 2025 11:27 PM | Updated on Jul 25 2025 8:01 AM

ENG VS IND 4th Test Day 2: England team in strong position

డకెట్, క్రాలీ

ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 225/2

డకెట్, క్రాలీ ధనాధన్‌ ఇన్నింగ్స్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 ఆలౌట్‌

రాణించిన పంత్, శార్దుల్‌

5 వికెట్లు తీసిన స్టోక్స్‌   

మాంచెస్టర్‌: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ మళ్లీ ‘బజ్‌బాల్‌’ ఆటకు దిగినట్లుంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌లిద్దరూ వన్డేను తలపించే బ్యాటింగ్‌ దూకుడు కనిపించడంతో ఒక్క సెషన్‌లోనే 148 పరుగులు చేసింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను గాయపడిన రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు దిగి ఆదుకున్నాడు. 

టెస్టులో పోరాడేందుకు తనవంతు పరుగులు జతచేసే నిష్క్రమించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 114.1 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (75 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శార్దుల్‌ ఠాకూర్‌ (88 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించారు. లోయర్‌ ఆర్డర్‌పై ప్రతాపం చూపిన బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. 

అనంతరం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ డకెట్‌ (100 బంతుల్లో 94; 13 ఫోర్లు) అదరగొట్టారు. పోప్‌ (20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), రూట్‌ (11 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. జడేజా, అన్షుల్‌ కంబోజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది.  

తడబడిన మిడిలార్డర్‌ 
రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 264/4తో గురువారం ఆట ప్రారంభించిన భారత్‌ ఆదిలోనే కీలకమైన వికెట్‌ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక పరుగే జతచేసిన జడేజా (20; 3 ఫోర్లు)ను ఆర్చర్‌ బోల్తా కొట్టించాడు. ఈ దశలో శార్దుల్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. 

ఈ సెషన్‌ ముగిసే దశలో ఉండగా క్రీజులో పాతుకుపోయిన శార్దుల్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. తొలిరోజు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ దశలో 321/6 స్కోరు వద్ద వర్షం కాసేపు ఆటంకపరిచింది. అక్కడితోనే తొలి సెషన్‌ ముగిసింది. రెండో సెషన్‌లో పంత్, సుందర్‌ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ బలపడుతుండగానే స్టోక్స్‌ మళ్లీ గట్టిదెబ్బే కొట్టాడు. 

నాలుగు బంతుల వ్యవధిలో సుందర్‌ (90 బంతుల్లో 27; 2 ఫోర్లు), అన్షుల్‌ కంబోజ్‌ (0)లను అవుట్‌ చేశాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో 6 కొట్టిన పంత్‌... స్టోక్స్‌ వేసిన మరుసటి ఓవర్లో బౌండరీతో 69 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత కాసేపటికే ఆర్చర్‌... పంత్‌తో పాటు బుమ్రా (4) వికెట్‌ పడగొట్టడంతో భారత్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) డాసన్‌ 58; రాహుల్‌ (సి) క్రాలీ (బి) వోక్స్‌ 46; సుదర్శన్‌ (సి) కార్స్‌ (బి) స్టోక్స్‌ 61; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్‌ 12; పంత్‌ (బి) ఆర్చర్‌ 54; జడేజా (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 20; శార్దుల్‌ (సి) డకెట్‌ (బి) సోŠట్‌క్స్‌ 41; సుందర్‌ (సి) వోక్స్‌ (బి) స్టోక్స్‌ 27; అన్షుల్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0; బుమ్రా (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 4; సిరాజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (114.1 ఓవర్లలో ఆలౌట్‌) 358. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 4–235, 5–266, 6–314, 7–337, 8–337, 9–349, 10–358. బౌలింగ్‌: వోక్స్‌ 23–5–66–1, ఆర్చర్‌ 26.1–3–73–3, కార్స్‌ 21–1–71–0, స్టోక్స్‌ 24–3–72–5, డాసన్‌ 15–1–45–1, జో రూట్‌ 5–0–19–0. 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) రాహుల్‌ (బి) జడేజా 84; డకెట్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) అన్షుల్‌ 94, ఒలీ పోప్‌ (బ్యాటింగ్‌) 20; రూట్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (46 ఓవర్లలో 2 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–166, 2–197. 
బౌలింగ్‌: బుమ్రా 13–4–37–0, అన్షుల్‌ కంబోజ్‌ 10–1–48–1, సిరాజ్‌ 10–0–58–0, శార్దుల్‌ 5–0–35–0, జడేజా 8–0–37–1.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement