IND vs ENG: 9 తీస్తారా... సమం చేస్తారా? | IND vs ENG 5th Test Day 3: Day 3 Report | Sakshi
Sakshi News home page

IND vs ENG: 9 తీస్తారా... సమం చేస్తారా?

Aug 2 2025 11:31 PM | Updated on Aug 3 2025 1:27 AM

IND vs ENG 5th Test Day 3: Day 3 Report

జైస్వాల్‌ సెంచరీ సంబరం

గెలుపు భారమంతా భారత బౌలర్లపైనే

ఇంగ్లండ్‌ విజయ లక్ష్యం 374 ∙ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 50/1

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 396 ∙యశస్వి జైస్వాల్‌ శతకం

ఆకాశ్‌దీప్, జడేజా, సుందర్‌ అర్ధ సెంచరీలు

ఆఖరి పోరులో గెలవాలన్నా... సిరీస్‌ను సమం చేయాలన్నా... ఇప్పుడు భారత్‌ భారమంతా బౌలర్లమీదే ఉంది. బ్యాట్‌ పట్టి అర్ధశతకాలతో రెండో ఇన్నింగ్స్‌లో నిలబెట్టిన బౌలర్లే... ఇప్పుడు 9 వికెట్లు తీస్తే 2–2తో ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’ సిరీస్‌ను సమం చేసిన గర్వంతో భారత్‌ స్వదేశానికి బయల్దేరుతుంది. ఇదే జరిగితే టీమిండియా టెస్టుల భవిష్యత్తుకు ఇక ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ ఫార్మాట్‌ నుంచి స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తప్పుకోవడంతో డీలాపడిన టెస్టు జట్టుకు నూతనోత్సాహాన్ని ఇంగ్లండ్‌ పర్యటన ఇచ్చినట్లు అవుతుంది. భారత్‌ నిర్దేశించిన 374 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌  ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 50 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. భారత్‌ నెగ్గాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. మొత్తానికి సిరీస్‌లోని చివరి టెస్టులోనూ ఫలితం రావడం ఖాయమైంది.    

లండన్‌: కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్‌ గిల్, కరుణ్‌ నాయర్‌... వీళ్లంతా స్పెషలిస్టు బ్యాటర్లు. కానీ కీలకమైన చివరి టెస్టులో బ్యాట్లెత్తారు. పేసర్‌ ఆకాశ్‌దీప్‌ సహా రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లు ప్రధానంగా బౌలర్లు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అయినా భారత బ్యాటింగ్‌ భారాన్ని మోశారు. ప్రధాన బ్యాటింగ్‌ బలగమే కనీసం 20 పరుగులైనా చేయలేకపోయిన చోటు ఈ ముగ్గురు అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (118; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... ఆకాశ్‌దీప్, జడేజా, సుందర్‌ తమ విలువైన అర్ధశతకాలతో ఈ టెస్టులో పోరాడే స్కోరును జత చేశారు. 

దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 396 పరుగులు చేసింది. ఆకాశ్‌దీప్‌ (66; 12 ఫోర్లు), జడేజా (53; 5 ఫోర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జోష్‌ టంగ్‌ 5 వికెట్లు, అట్కిన్సన్‌ 3 వికెట్లు, ఓవర్టన్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట నిలిచే ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రాలీ (14)ని సిరాజ్‌ బౌల్డ్‌ చేయగా, డకెట్‌ (34 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.  

ఊహించని ఫిఫ్టీ... 
ఓవర్‌నైట్‌ స్కోరు 75/2 శనివారం మూడో రోజు ఆట రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌కు, ఓపెనర్‌ జైస్వాల్‌కు ఆకాశ్‌దీప్‌ కొండంత అండగా నిలిచాడు. ‘నైట్‌ వాచ్‌మన్‌’గా వచ్చిన ఆకాశ్‌దీప్‌ ఊహించని విధంగా ఆతిథ్య బౌలర్లను ఎదుర్కొన్నాడు. తొలిసెషన్‌లో తేలిగ్గానే అతని వికెట్‌ను దక్కించుకుందామనుకున్న ప్రధాన పేసర్లు అట్కిన్సన్, టంగ్‌లకు కొరకరాని కొయ్యగా మారాడు. మరోవైపు జైస్వాల్‌ కూడా అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును కదిలించాడు. మూడో వికెట్‌కు 100 పరుగులు జతయ్యాక 70 బంతుల్లో ఆకాశ్‌దీప్‌ టెస్టుల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతే జట్టు స్కోరు 177 వద్ద వెనుదిరిగాడు. 
  
జైస్వాల్‌ ‘శత’క్కొట్టినా... రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు ప్రభావం 
చూపెట్టారు. గిల్‌ (11), కరుణ్‌ నాయర్‌ (17)లను అట్కిన్సన్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో జైస్వాల్‌ ... జడేజా అండతో పరుగులు చక్కబెట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్‌ టెస్టుల్లో ఆరో సెంచరీని 127 బంతుల్లో పూర్తిచేసుకున్నాడు. భాగస్వామ్యం బలపడుతుండగానే టంగ్‌... జైస్వాల్‌ వికెట్‌ తీసి దెబ్బకొట్టాడు. ధ్రువ్‌ జురేల్‌ (34; 4 ఫోర్లు)తో కలిసి జడేజా జట్టు స్కోరును 300 దాటించాడు. 304/6 స్కోరు వద్ద రెండో సెషన్‌ ముగిసింది. ఆఖరి సెషన్‌ మొదలైన కొద్దిసేపటి తర్వాత జురేల్‌ అవుటవ్వగా... జడేజా, సుందర్‌ టీమిండియాను నడిపించారు. జడేజా 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే వికెట్‌ను సమరి్పంచుకోగా, సుందర్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో మెరుపు ఫిఫ్టీని సాధించి స్కోరు పెంచే క్రమంలో అవుట్‌కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 224; 
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 247; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఓవర్టన్‌ (బి) టంగ్‌ 118; రాహుల్‌ (సి) రూట్‌ (బి) టంగ్‌ 7; సాయి సుదర్శన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్‌ 11; ఆకాశ్‌దీప్‌ (సి) అట్కిన్సన్‌ (బి) ఓవర్టన్‌ 66; శుబ్‌మన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అట్కిన్సన్‌ 11; నాయర్‌ (సి) స్మిత్‌ (బి) అట్కిన్సన్‌ 17; జడేజా (సి) బ్రూక్‌ (బి) టంగ్‌ 53; ధ్రువ్‌ జురేల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఓవర్టన్‌ 34; సుందర్‌ (సి) క్రాలీ (బి) టంగ్‌ 53; సిరాజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) టంగ్‌ 0; ప్రసిధ్‌కృష్ణ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (88 ఓవర్లలో ఆలౌట్‌) 396. వికెట్ల పతనం: 1–46, 2–70, 3–177, 4–189, 5–229, 6–273, 7–323, 8–357, 9–357, 10–396. బౌలింగ్‌: అట్కిన్సన్‌ 27–3–127–3, టంగ్‌ 30–4–125–5, ఓవర్టన్‌ 22–2–98–2, బెథెల్‌ 4–0–13–0, రూట్‌ 5–1–15–0. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) సిరాజ్‌ 14; డకెట్‌ (బ్యాటింగ్‌) 34; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 50. వికెట్ల పతనం: 1–50. 
బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 5–1–15–0, ప్రసిధ్‌ 5–1–23–0, సిరాజ్‌ 3.5–0–11–1.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement