లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్హానించాడు. అయితే మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.
యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
గిల్, ఇషాన్ మెరుపు సెంచరీలు..
మంచి టచ్‌లో కన్పించిన రోహిత్ శర్మ(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 మ్యాచ్‌ను తలపించేలా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకోగా.. కిషన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఓవరాల్‌గా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా.. కిషన్ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125 రన్స్ చేసి ఔటయ్యాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్లు నంగ్యాలియా ఖరోటి నాలుగు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఘజన్‌ఫర్, మహ్మద్ సలీమ్ తలా వికెట్ సాధించారు.


