
Anrich Nortje Ruled Out Of Test Series Vs IND.. టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే దక్షిణాఫ్రికా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్‌రిచ్ నోర్ట్జే టెస్టు సిరీస్ మొత్తానికే దూరమయినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ట్విటర్‌లో ప్రకటించింది. టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నోర్ట్జే వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. తాజాగా మోకాలి గాయం తిరగబెట్టడంతో టీమిండియాతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక నోర్జ్టే దక్షిణాఫ్రికా తరపున 12 టెస్టుల్లో 47 వికెట్లు తీశాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల హాల్‌ను సాధించాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లోనూ నోర్ట్జే మంచి ప్రదర్శన కనబరిచాడు. నెట్‌రన్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న నోర్ట్జే రెండేళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తూ స్థిరంగా వికెట్లు తీశాడు.
''దక్షిణాఫ్రికాకు కీలకబౌలర్‌గా ఉన్న నోర్జ్టే టీమిండియాతో టెస్టు సిరీస్‌కు దూరమవ్వడం మాకు పెద్ద లోటు. కానీ వరుస గాయాలతో అతను ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వన్డు సిరీస్‌కు కూడా నోర్జ్టే అందుబాటులోకి వస్తాడా లేదో చెప్పలేని పరిస్థితి. ఇక నోర్ట్జే స్థానంలో టెస్టు సిరీస్‌కు ఎవరిని ఎంపికచేయడం లేదు. నోర్జ్టే గైర్హాజరీలోనూ కగిసో రబాడ, బీరన్ హెండ్రిక్స్, గ్లెంటన్ స్టుర్‌మాన్, డ్యుయాన్నే ఒలివర్, సిసండా మగాలాలతో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. వీరితో పాటు వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్‌లు పేస్ ఆల్‌రౌండర్లుగా సేవలందించనున్నారు. అని సీఎస్‌ఏ చెప్పుకొచ్చింది.