Rahul Dravid: అక్కడ కోచింగ్‌ ఇచ్చినట్లు ఇక్కడ చేస్తానంటే కుదరదు కదా.. నాకు ఆ ఆలోచనే లేదు!

India T20 Captain Rohit Sharma Coach Rahul Dravid 1st Press Conference Highlights - Sakshi

India T20 Captain Rohit Sharma Coach Rahul Dravid 1st Press Conference Highlights: టీ20 ప్రపంచకప్‌-2021లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచిన టీమిండియా న్యూజిలాండ్‌తో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. టోర్నీ రన్నరప్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఇది తొలి సిరీస్‌ కాగా... హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌కు సైతం ఇదే మొదటి సిరీస్‌. దీంతో సహజంగానే వీరిద్దరికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్‌, ద్రవిడ్‌ తొలిసారిగా టీ20 కెప్టెన్‌, కోచ్‌ హోదాలో మీడియాతో ముచ్చటించారు.

ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తాం
టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో వైఫల్యం, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం గురించి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... ‘‘భారత జట్టు ఈసారి వరల్డ్‌ కప్‌ గెలవలేదనేది వాస్తవమే కానీ ఈ ఫార్మాట్‌లో చాలా విజయాలు సాధించింది. మేం సరిదిద్దుకోవాల్సిన లోపాలూ ఉన్నాయి. అయితే రాబోయే రోజుల కోసం ఇతర జట్లను అనుసరించకుండా మేం మా జట్టుకు ఎలాంటి అవసరం ఉందో అలాంటి ప్రత్యేక ‘నమూనా’ను సిద్ధం చేసుకొని దాని ప్రకారం ఆడాల్సి ఉంది. కొత్త కుర్రాళ్లంతా దేశవాళీలో ఎలా ఆడారనేది అనవసరం. ఇక్కడ టీమ్‌కు అనుగుణంగానే మారాల్సి ఉంటుంది. అందుకు కొంత సమయం కూడా పట్టవచ్చు. అందు కోసం వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తాం’’ అని తమ వైఖరిని వెల్లడించాడు.

అక్కడ చేసినట్లు ఇక్కడా చేస్తానంటే కుదరదు కదా..
రిటైర్మెంట్‌ తర్వాత భారత అండర్‌–19, ‘ఎ’ జట్లకు కోచ్‌గా వ్యవహరించడంతో పాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్‌ ద్రవిడ్‌కు సీనియర్‌ టీమ్‌తో కలిసి పని చేయడం ఇదే తొలిసారి (ప్రధాన ఆటగాళ్లు లేని శ్రీలంక సిరీస్‌ను మినహాయిస్తే). ద్రవిడ్‌తోపాటు కోచింగ్‌ బృందంలో రెండు కీలక మార్పులు జరిగాయి. బౌలింగ్‌ కోచ్‌గా పారస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ రాగా...బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ కొనసాగనున్నాడు. 

ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తమ ప్రణాళికల గురించి చెబుతూ.. ‘‘భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘ ప్రణాళికతో పని చేయడం...జట్టు విజయాలు సాధించడం రెండూ ముఖ్యమే. సీనియర్‌ టీమ్‌పై అందరి దృష్టి ఉంటుంది. గెలవాలనే అంతా కోరుకుంటారు. అండర్‌–19కు కోచింగ్‌ ఇచ్చినట్లు ఇక్కడ చేస్తానంటే కుదరదు. దీని సవాళ్లు, అవసరాలు వేరు. ఆటగాళ్లనుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే కోచ్‌ల పని’’ అని పేర్కొన్నాడు.

మూడు ఫార్మాట్లకు మూడు జట్లు?
‘‘ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు మూడు జట్లు అన్న అంశం గురించి మేము ఆలోచించడం లేదు. ఆటగాళ్ల ఆరోగ్యం, మానసిక స్థితి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి తగినంత విశ్రాంతి కావాలి. అయినా.. మనకు అందరూ అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు మాత్రమే లేరు. అవసరానికి తగినట్లు కొంతమందికి విశ్రాంతినివ్వడం... అలాంటి సమయాల్లో జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు తమ ప్రతిభ నిరూపించుకోవడం చూస్తూనే ఉన్నాం. ముందు చెప్పినట్లుగా ప్రస్తుతానికైతే.. మూడు ఫార్మాట్లకు మూడు జట్లను ఆడించే ఆలోచన ఎంతమాత్రం లేదు’’ అని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు.

చదవండి: IND vs NZ 1st T20 2021: 'ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌కు నో ఛాన్స్‌'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top