దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. .. హార్ధిక్‌, డీకే రీ ఎంట్రీ

India Squad For South Africa T20 Series And England Tour Announced - Sakshi

సీనియర్లకు విశ్రాంతి

కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

ముంబై: ఐపీఎల్‌లో సత్తా చాటిన ఇద్దరు యువ పేస్‌ బౌలర్లకు భారత జట్టు పిలుపు లభించింది. ఫాస్ట్‌ బౌలింగ్‌తో అదరగొట్టిన ఉమ్రాన్‌ మలిక్, పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌లకు మొదటిసారి టీమిండియా అవకాశం దక్కింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 18 మంది సభ్యుల భారత జట్టును సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతినివ్వడంతో కేఎల్‌ రాహుల్‌ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కొంత విరామం తర్వాత హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్‌ 9న (ఢిల్లీ), 12న (కటక్‌), 14న (విశాఖపట్నం), 17న (రాజ్‌కోట్‌), 19న (బెంగళూరు) ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.  

వేగం...పొదుపు... 
ప్రస్తుత ఐపీఎల్‌ ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు ఉమ్రాన్, అర్‌‡్షదీప్‌ ఎంపిక చూపిస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్‌ తన అసలు సిసలు ఫాస్ట్‌ బౌలింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం 150 కి.మీ. వేగానికి తగ్గకుండా బౌలింగ్‌ చేస్తూ వచ్చిన అతను ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బాల్‌ (156.9 కి.మీ.)ను నమోదు చేశాడు. వేగంతో కొన్నిసార్లు గతి తప్పినా... ఎక్కువ భాగం నియంత్రణతో కూడిన బౌలింగ్‌ను ప్రదర్శించిన ఉమ్రాన్‌ 22 వికెట్లు పడగొట్టాడు. అర్‌‡్షదీప్‌ ఖాతాలో 10 వికెట్లే ఉన్నా పొదుపైన బౌలింగ్‌ (7.70 ఎకానమీ)తో ఆకట్టుకున్నాడు.   

వారిద్దరూ వచ్చారు... 
2021 టి20 ప్రపంచకప్‌లో ఆడినా ఎక్కువ భాగం బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్‌ పాండ్యా ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ఐపీఎల్‌లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న అతనికి సహజంగానే భారత జట్టులో చోటు లభించింది. 2019 తర్వాత భారత జట్టుకు ఆడని దినేశ్‌ కార్తీక్‌ కూడా ఐపీఎల్‌ ప్రదర్శనతోనే తిరిగి రావడం విశేషం. ఈ సీజన్‌లో 191.33 స్ట్రయిక్‌రేట్‌తో 287 పరుగులు చేసిన అతను డెత్‌ ఓవర్లలో మరింత చెలరేగిపోయాడు. గాయాల నుంచి ఇంకా కోలుకోని దీపక్‌ చహర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్లను సెలక్టర్లు పరిశీలించలేదు. భారత జట్టు చివరిగా శ్రీలంకతో టి20 సిరీస్‌ ఆడగా... అందులో భాగంగా ఉన్న సంజు సామ్సన్, మొహమ్మద్‌ సిరాజ్‌ మాత్రం జట్టులో చోటు కోల్పోయారు. 

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
చదవండి: హిట్‌మ్యాన్‌ ఖాతాలో మరో రెండు చెత్త రికార్డులు

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top