India Become World No. 1 Test Side, Claim Top Spot In All Formats - Sakshi
Sakshi News home page

టెస్టుల్లోనూ నెంబర్‌వన్‌.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర

Published Wed, Feb 15 2023 3:07 PM

India Become World No-1 Winning 1st Test Vs AUS Claim Top-Spot All Formats - Sakshi

సంప్రదాయ ఫార్మాట్‌.. టెస్టు క్రికెట్‌లో టీమిండియా నెంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహించింది. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించడం ద్వారా నాలుగు పాయింట్లు పొంది అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 115 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే వన్డే, టి20 క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంది.

తద్వారా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిచిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. మరోవైపు భారత్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్‌ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ 100 పాయింట్లతో నాలుగు, సౌతాఫ్రికా 85 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.  ఇక ఆసీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు వికెట్ల వేటతో ఆసీస్‌ నడ్డి విరిచారు.

ఏకకాలంలో మూడు ఫార్మాట్స్‌లోనూ టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనత అందుకోవడంతో హిట్‌మ్యాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్రకెక్కాడు. ఇంతకముందు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలవడం ద్వారా టీమిండియా వన్డేల్లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా టి20 ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించింది. అయితే ఈ సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికి.. అధికారికంగా మాత్రం మూడు ఫార్మాట్లకు రోహిత్‌ శర్మనే ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 

చదవండి: వాలెంటైన్స్‌ డే ఎంత పని చేసింది.. శుభ్‌మన్‌, సారా రిలేషన్‌ను బయటపెట్టింది..!

Advertisement
Advertisement