
ఆసియా కప్ 2025 (Asia cup 2025) విజేతగా టీమిండియా (Team India) అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై (India vs Pakistan) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్‌లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.
33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.
అంతకుముందు భారత్ 20 పరుగులకే అభిషేక్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (12), సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అఫ్రాఫ్ 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భారత్ పాక్‌పై గెలవడం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశలో, సూపర్-4లో కూడా టీమిండియానే విజయం సాధించింది.