ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వారం రోజులు తిరగకముందే మరో కఠిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమైంది. స్వదేశంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లతో బరిలోకి దిగనుందా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గాయం కారణంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన రిషబ్ పంత్.. తిరిగి ప్రోటీస్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు.
దీంతో పంత్‌కు యథావిధిగా వికెట్ కీపర్ కోటాలో తుది జట్టులో చోటు దక్కనుంది. మరోవైపు పంత్‌కు బ్యాకప్‌గా ఉన్న ధ్రువ్ జురెల్ సైతం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో శతొక్కొట్టిన జురెల్.. ఇప్పుడు సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో కూడా అదరగొట్టాడు. జురెల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో కదం తొక్కాడు. ఈ యూపీ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఎనిమిది ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
నితీశ్‌పై వేటు?
దీంతో సూపర్ ఫామ్‌లో ఉన్న జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానంలో జురెల్‌కు అవకాశమివ్వనున్నట్లు సమాచారం. ఉపఖండం పిచ్‌లలో నితీశ్ కుమార్ బౌలింగ్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు.
గత నెలలో విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా నితీశ్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో జురెల్‌కు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని హెడ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
39 ఏళ్ల తర్వాత..
వన్డేల్లో ఎంఎస్ ధోని, దినేష్ కార్తీక్ లేదా ధోని, పార్థివ్ పటేల్ వంటి ఇద్దరు కీపర్లు కలిసి ఆడినప్పటకి.. టెస్టు తుది జట్టులో మాత్రం ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఆడటం చాలా అరుదు. గతంలో 1986లో కిరణ్ మోర్, చంద్రకాంత్ పండిట్‌లు కలిసి ఒకటి రెండు టెస్టులు ఆడారు. అప్పుడు పండిట్‌కు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా అవకాశం దక్కింది. ఇప్పుడు మళ్లీ 39 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లతో భారత్ ఆడనుంది.
చదవండి: ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 రన్స్


