Ind Vs WI: ODI T20 India Squad Eyebrows Raised 3 Selection Decision Shockers - Sakshi
Sakshi News home page

Ind Vs WI: కుల్దీప్‌ యాదవ్‌ ఎందుకు? అసలు ఆ ముగ్గురిని ఎంపిక చేసి పొరపాటు చేశారా? రుతును ఎందుకు తప్పించారు?

Published Thu, Jan 27 2022 4:36 PM

Ind Vs WI: ODI T20 India Squad Eyebrows Raised 3 Selection Decision Shockers - Sakshi

కరోనా కాలంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలోనూ రిస్క్‌ చేసి మరీ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది. టెస్టు, వన్డే సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ మినహా... ఐదింటిలోనూ ఓటమి పాలైంది. ముఖ్యంగా వన్డే సిరీస్‌ను 0-3తో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో సత్తా చాటి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఈ క్రమంలో వన్డే, టీ20 సిరీస్‌కు బీసీసీఐ బుధవారం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఘోర పరాభవం తర్వాత జరుగనున్న ఈ సిరీస్‌ కీలకంగా మారిన నేపథ్యంలో కొంతమంది ప్లేయర్ల ఎంపిక, మరికొందరిని విస్మరించిన తీరు క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్‌కప్‌నకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

విండీస్‌తో సిరీస్‌కు ప్రకటించిన వన్డే జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్, శిఖర్‌ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్, దీపక్‌ హుడా.  

అసలు కుల్దీప్‌ యాదవ్‌ ఎందుకు?
గతేడాది జూలై తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న అతడిని వన్డే జట్టుకు ఎంపిక చేశారు. ఇక దీపక్‌ హుడా.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో పెద్దగా రాణించేదేమీ లేదు. కర్ణాటకతో మ్యాచ్‌లో సెంచరీ ఒక్కటే అతడి ప్రదర్శనలో చెప్పుకోదగ్గది. నిజానికి హిమాచల్‌ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ రిషి ధావన్‌కు అద్భుత రికార్డు ఉంది. 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. జట్టును తొలిసారిగా విజేతగా నిలిపి చరిత్ర సృష్టించాడు.

ఇదిలా ఉంటే... అకస్మాత్తుగా రవి బిష్ణోయి పేరు తెరమీదకు వచ్చింది. రాహుల్‌ చహర్‌ను కాదని ఈ యువ స్పిన్నర్‌ ఎంపిక ఆశ్చర్యకరమే. టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత అతడిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కానీ.. తనదైన రోజు చహర్‌ మెరుగ్గా రాణించగలడన్న సంగతి తెలిసిందే. ఇక పృథ్వీ షాను కూడా సెలక్టర్లు పక్కన పెట్టడం విస్మయానికి గురిచేసే అంశమే. 

చదవండి: Ravi Bishnoi: ఐపీఎల్‌లో 4 కోట్లు... ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టులో చోటు.. అదిరిందయ్యా రవి.. అంతా ఆ దిగ్గజ క్రికెటర్‌ వల్లే!

వీళ్లను ఎంపిక చేసే పెద్ద పొరపాటే చేశారా?
కుల్దీప్‌ యాదవ్‌:
ఆరు నెలలుగా కుల్దీప్‌ యాదవ్‌ క్రియాశీలకంగా లేడు. రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకోకపోవడం, దక్షిణాఫ్‌రికా పర్యటనలో అశ్విన్‌ పేలవ ప్రదర్శన... ఫలితంగా స్పిన్నర్‌ కోటాలో కుల్దీప్‌నకు చోటు దక్కిందని చెప్పవచ్చు. అయితే, రాహుల్‌ చహర్‌ను కాదని అతడిని ఎంపిక చేయడం పొరపాటే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీపక్‌ హుడా:
ఐపీఎల్‌ 2021, విజయ్‌ హజారే ట్రోఫీలోనూ దీపక్‌ ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో 160 పరుగులు సాధించడం సహా కేవలం రెండు వికెట్లు పడగొట్టాడు. ముందుగా చెప్పినట్లు ఒక్క సెంచరీ మినహా దేశవాళీ వన్డే టోర్నీలో పెద్దగా సాధించిందేమీ లేదు. మరి ఆల్‌రౌండర్‌ కోటాలో దీపక్‌ను ఎందుకు ఎంపిక చేశారో సెలక్టర్లకే తెలియాలి! నిజానికి వెంకటేశ్‌ అయ్యర్‌ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పూర్తిగా తేలిపోయిన మాట వాస్తవమే. కానీ... అతడికి మరో అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

టీ20 జట్టు:  రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్‌ అయ్యర్, పంత్, వెంకటేశ్‌ అయ్యర్, దీపక్‌ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్‌ సుందర్, భువనేశ్వర్, అక్షర్‌ పటేల్, సిరాజ్, హర్షల్‌ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్‌.    

రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎందుకు తప్పించారు?
టీ20 జట్టులో టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరు లేకపోడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశం. ఐపీఎల్‌-2021లో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ అతడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. కానీ.. ఇతడికి టీ20 జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. నిజానికి వన్డే సిరీస్‌లోనూ రుతుకు ఆడే అవకాశం రాకపోవచ్చు.

ఓపెనింగ్‌ బ్యాటర్‌గా ఉండటమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక అతడికి జోడీగా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఉండనే ఉన్నాడు. తొలి వన్డేకు రాహుల్‌ దూరమైనప్పటికీ అతడి స్థానాన్ని సీనియర్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ భర్తీ చేసే అవకాశాలు మెండు. ఒకవేళ ధావన్‌ను కాదని రుతుకు అవకాశం ఇస్తే మాత్రం అతడు కచ్చితంగా తనను నిరూపించుకుంటాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో అదరగొట్టిన ఈ బ్యాటర్‌... స్వదేశంలో విండీస్‌తో సిరీస్‌లో ఛాన్స్‌ వస్తే కచ్చితంగా అద్భుతాలు చేయగలడు.

చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్‌ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్‌ తివారి

Advertisement
Advertisement