అందుకే ఓడిపోయాము.. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే దక్కాలి: విండీస్‌ కెప్టెన్‌ | IND vs WI 3rd T20I Credit to Indian bowlers: Shai Hope After Loss To IND | Sakshi
Sakshi News home page

అందుకే ఓడిపోయాము.. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే దక్కాలి: విండీస్‌ కెప్టెన్‌

Oct 12 2026 10:50 AM | Updated on Oct 12 2026 11:06 AM

IND vs WI 3rd T20I Credit to Indian bowlers: Shai Hope After Loss To IND

హోప్‌ను అవుట్‌​ చేసిన అర్ష్‌దీప్‌ (PC: Starsports/X)

వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమిండియా విజయం సాధించింది. పర్యాటక జట్టును 14 పరుగుల తేడాతో ఓడించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజ వేసింది. మరోవైపు.. గత మ్యాచ్‌లో గెలుపు రుచి చూసిన విండీస్‌కు మాత్రం ఇండోర్‌లో చేదు అనుభవమే మిగిలింది.

ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై వెస్టిండీస్‌ కెప్టెన్‌ షాయీ హోప్‌ స్పందించాడు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందన్నాడు. భారత్‌ విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్‌ ప్లేలో మరింత దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఓటమికి ఎన్నో కారణాలు
‘‘ఈ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. స్వల్ప తేడాతో మరో మ్యాచ్‌లో మేము ఓడిపోయాము. పిచ్‌ను మేము ఇంకాస్త మెరుగ్గా ఉపయోగించుకుని ఉండాల్సింది. ఏదేమైనా ఆరంభంలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నా ఆఖర్లో మా బౌలర్లు పుంజుకున్న తీరు ప్రశంసనీయం.

రోస్టన్‌ ఛేజ్‌ బాగా ఆడాడు. మా బౌలర్లు ప్రత్యర్థిని కాస్త కట్టడి చేసి ఛేదించదగ్గ స్కోరుకు పరిమితం చేశారు. అయితే, పవర్‌ ప్లేలో త్వరత్వరగా వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌ మీద భారం పడుతుంది. ఏదేమైనా ఇది సమిష్టి బ్యాటింగ్‌ వైఫల్యం.

ఇలా స్వల్ప తేడాతో మళ్లీ గెలవొచ్చు కూడా!
పద్నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయాము. మేము ఇలా స్వల్ప తేడాతో మళ్లీ గెలవొచ్చు కూడా!.. సెకండ్‌ ఇన్నింగ్స్‌ సమయానికి వికెట్‌ కాస్త పొడిగా మారింది. తద్వారా భారత బౌలర్లు వైవిధ్యంగా బంతులు వేసేందుకు అవకాశం దొరికింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ తన రెండు లేదంటే మూడో ఓవర్లో నన్ను అవుట్‌ చేశాడు.

క్రెడిట్‌ మొత్తం వారికే దక్కాలి
ఏదేమైనా టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ విజయంలో క్రెడిట్‌ మొత్తం వారికే ఇవ్వాలి. మంచి యార్కర్లు వేశారు. కొన్ని యార్కర్లు అయితే దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి. వాళ్ల ప్రణాళికల్ని చక్కగా అమలు చేశారు’’ అని షాయీ హోప్‌ పేర్కొన్నాడు.

223 పరుగులు చేసి ఆలౌట్‌
కాగా ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో ఆదివారం  నాటి మూడో టీ20లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అభిషేక్‌ శర్మ మెరుపు అర్ధ శతకం (30 బంతుల్లో 69) బాదగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 37), తిలక్‌ వర్మ (16 బంతుల్లో 28) రాణించారు.

అదరగొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌ 
లక్ష్య ఛేదనకు దిగిన కరేబియన్‌ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 209 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లలో షాయీ హోప్‌ (5) విఫలం కాగా.. కామిల్‌ పూరన్‌ (27 బంతుల్లో 42) ఫర్వాలేదనిపించాడు. షిమ్రన్‌ హెట్‌మైర్‌ (26 బంతుల్లో 43) రాణించగా.. ఆఖర్లో షమార్‌ స్ప్రింగర్‌ (11 బంతుల్లో 35 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

భారత బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు తీయగా.. నమన్‌ ధిర్‌ రెండు, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

చదవండి: ఆ అమ్మాయికి మాటిస్తున్నా: శ్రేయస్‌ అయ్యర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement