టాస్‌కు ముందు పిచ్‌ను పరిశీలిస్తున్న రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్(PC: BCCI)
భువీని కాదని ఆవేశ్ చేతికి బంతి! భారీ మూల్యం చెల్లించిన భారత్! రోహిత్ ఏమన్నాడంటే!
India Vs West Indies 2nd T20- Rohit Sharma Comments On Loss: కరీబియన్ గడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జోరుకు ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బ్రేకులు వేసింది. రెండో టీ20లో విజయం సాధించి ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పైచేయి సాధించి 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.
టాస్ గెలిచి...
సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్ వేదికగా సోమవారం విండీస్- టీమిండియా మధ్య రెండో టీ20 జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ దెబ్బకొట్టాడు.
కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేయడం సహా.. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్‌ను 11 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 10 పరుగులకే పరిమితం కాగా.. రిషభ్ పంత్ 24 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా 31, రవీంద్ర జడేజా 27 పరుగులతో రాణించారు.
బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన దినేశ్ కార్తిక్(7 పరుగులు) వికెట్ తీసి మరోసారి మెకాయ్.. దెబ్బతీశాడు. అశ్విన్ 10, భువనేశ్వర్ 1, ఆవేశ్ ఖాన్ 8, అర్ష్‌దీప్ 1(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 19.4 ఓవర్లలో రోహిత్ సేన 138 పరుగులు సాధించింది.
అదరగొట్టిన బ్రాండన్!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్(68 పరుగులు) అద్భుత ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ కైలీ మేయర్స్ మాత్రం 8 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ నికోలస్ పూరన్(14 పరుగులు) మరోసారి నిరాశపరిచాడు.
షిమ్రన్ హెట్‌మెయిర్ 6 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. బౌండరీ బాది విండీస్ విజయం ఖరారు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్‌ను కాదని.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌కు బంతిని ఇవ్వడం గమనార్హం.
ఇక 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేయగా(6 పరుగులు ఇచ్చాడు)... ఆఖరి ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ తేలిపోయాడు. మొదటి బంతి నోబాల్ కాగా.. థామస్ వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో భారత్ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు.
మా బ్యాటింగ్ బాగాలేదు!
ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. అదే విధంగా డెత్ ఓవర్లలో యువ ఆటగాళ్లను బరిలోకి దింపడంపై వివరణ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. పిచ్ చాలా బాగుంది. కానీ మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. మెరుగైన స్కోరు నమోదు చేయలేకపోయాము.
అందుకే వాళ్లకు అవకాశం!
అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ప్రతిసారి అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. మాకు ఇదొక గుణపాఠం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇక ఆఖరి ఓవర్ విషయానికొస్తే.. యువకులకు తప్పక అవకాశాలు ఇవ్వాలి. నిజానికి భువి మాకోసం ఏం చేయగలడో.. ఏమేం చేశాడో ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపితమైంది.
గత కొన్నేళ్లుగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, ఆవేశ్, అర్ష్‌దీప్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా! వాళ్లలోని నైపుణ్యాలు, ప్రతిభకు పదును పెట్టగలరు. అయినా కేవలం ఈ ఒక్క గేమ్‌తో ఒక అంచనాకు రాలేము. నా జట్టు పట్ల నేను గర్వపడుతున్నా. నిజానికి 13-14 ఓవర్లోనే ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను మా వాళ్లు చివరి ఓవర్ వరకు లాక్కొచ్చారు.
మార్చే ప్రసక్తే లేదు!
మా బౌలర్లు అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. అయితే, బ్యాటింగ్ పరంగా మేము మెరుగుపడాల్సి ఉంది. కానీ, ప్రయోగాలకు మాత్రం వెనుకాడబోము. ఒక్క ఓటమి కారణంగా మేము బెంబేలెత్తిపోము. ఎలాంటి మార్పులకు ఆస్కారం ఇవ్వము’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా ఇటీవల తరచుగా ఓపెనింగ్ జోడీని మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్- టీమిండియా మధ్య మంగళవారం(ఆగష్టు 2) మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది.
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20:
లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం
►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్
►టాస్: వెస్టిండీస్- బౌలింగ్
►ఇండియా స్కోరు: 138 (19.4)
►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2)
►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు
►5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు)
చదవండి: Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్‌లో ఐదో బౌలర్‌గా
Watch as the #MenInMaroon celebrate clinching victory in the second match of the @goldmedalindia T20 Cup, presented by Kent Water Purifiers #WIvIND 🏏🌴 pic.twitter.com/UV5Sl2zfAc
— Windies Cricket (@windiescricket) August 1, 2022

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
