Ind Vs Pak: కోహ్లికి గంగూలీ పరోక్ష హెచ్చరిక?! సెంచరీ చేయాలని ఆశిస్తున్నా.. కానీ ఇప్పుడు కష్టమే!

Ind Vs Pak Ganguly: Kohli Need To Score Not Only For India But For Himself - Sakshi

Asia Cup 2022 India Vs Pakistan: ‘‘ప్రస్తుతం అతడు కేవలం దేశం కోసం మాత్రమే కాదు.. తన కోసం తాను కూడా పరుగులు సాధించాల్సి ఉంది’’ అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. అదే విధంగా కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేసిన దాదా.. అతడు సెంచరీ చేస్తే చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు. 

గడ్డు పరిస్థితుల్లో కింగ్‌..
ప్రస్తుతం కోహ్లి తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న ఈ స్టార్‌ బ్యాటర్‌ శతకం చేసి వెయ్యి రోజులు దాటిపోయింది. ఇక కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. ఆసియా కప్‌-2022 భారత్‌ - పాకిస్తాన్‌ మ్యాచ్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 

గొప్పగా ఉండాలి!
ఈ నేపథ్యంలో క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా కోహ్లి ఫామ్‌ గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మీడియా సమావేశంలో గంగూలీ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌-2022 ఆరంభానికి ముందు ఆసియా కప్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. ఈ మేరకు దాదా మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్‌ కోహ్లికి గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా.

సెంచరీ ఇప్పుడు కష్టమే!
తను తిరిగి ఫామ్‌లోకి వస్తాడని మాకు నమ్మకం ఉంది. అందరిలాగే మేము కూడా తను శతకం బాదితే చూడాలని కోరుకుంటున్నాం. అందుకు తగ్గట్లుగా కోహ్లి ప్రాక్టీసు​ చేశాడు కూడా! అయితే, టీ20లలో సెంచరీ చేసేందుకు అవకాశాలు తక్కువ. ఏదేమైనా ఇది కోహ్లికి గొప్ప సీజన్‌గా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.

కాగా ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌లో ఆడబోయే తొలి మ్యాచ్‌ కోహ్లికి 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో ఈ పరుగుల యంత్రంపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆదివారం(ఆగష్టు 28) పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా.. పాకిస్తాన్‌తో ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: Asia Cup 2022: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌! ఫ్రీగా చూడాలనుకుంటున్నారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top