Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్‌ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే!

Ind Vs NZ: Michael Bracewell Great Knock Was Not My Day Family Background - Sakshi

Who Is Michael Bracewell: మైకేల్‌ బ్రేస్‌వెల్‌.. గతేడాది నెదర్లాండ్స్‌తో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం.. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు.. అయితే, ఒక వికెట్‌ మాత్రం తీయగలిగాడు ఈ న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌. అదే ఏడాది జూన్‌లో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లో అడుగుపెట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుతో అర్ధ శతకం చేసే అవకాశం చేజార్చుకున్నాడు. అయితే, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20లలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల బ్రేస్‌వెల్‌.. ఇప్పటి వరకు తన కెరీర్‌లో సాధించినవి రెండు సెంచరీలు. అది కూడా వన్డేల్లో!

మొదటిది ‘పసికూన’ ఐర్లాండ్‌పై! మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఐరిష్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల ‘భారీ’ స్కోరు చేసింది. పర్యాటక కివీస్‌కు అంత తేలికగా గెలిచే అవకాశమూ ఇవ్వలేదు. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ మినహా అర్ధ శతకం(51) మినహా టాపార్డర్‌లో అందరూ చేతులెత్తేశారు. 

ఒక్క వికెట్‌ తేడాతో..
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రేస్‌వెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 127 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బ్రేస్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ చలువ వల్ల న్యూజిలాండ్‌ ఎట్టకేలకు ఒక్క వికెట్‌ తేడాతో గెలుపొందగలిగింది. ఆ తదుపరి రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి సిరీస్‌ను గెలిచింది.

బ్యాట్‌ ఝులిపించి..
ఇక రెండో వన్డే సెంచరీ.. కివీస్‌ మ్యాచ్‌ ఓడినా.. బ్రేస్‌వెల్‌ కెరీర్‌లో మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. సొంతడ్డపై.. పటిష్టమైన టీమిండియాపై.. అదీ కొండంత లక్ష్యం ముందున్న వేళ.. సహచరులు వరుసగా 40, 10, 18, 9, 24, 11 పరుగులకే పెవిలియన్‌ చేరిన తరుణంలో.. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ బ్రేస్‌వెల్‌ బ్యాట్‌ ఝులిపించాడు. 

ఫలితం తారుమారయ్యేదే!
78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 140 పరుగులతో చెలరేగాడు. సులువుగానే మ్యాచ్‌ గెలుస్తామని భావించిన టీమిండియాకు చెమటలు పట్టించాడు. ఓటమిని ఒప్పుకోలేక ఆఖరి ఓవర్‌ వరకు అసాధారణ పోరాటం చేశాడు. నిజానికి శార్దూల్‌ ఠాకూర్‌ గనుక బ్రేస్‌వెల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే ఉప్పల్‌ మ్యాచ్‌ ఫలితం తారుమారయ్యేదే! అదృష్టవశాత్తూ అలా జరుగలేదు. 

ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా అంతా ఫిదా
అయితే, ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీకి ఫిదా అయినట్లే.. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా.. మ్యాచ్‌ మన నుంచి లాగేసుకుంటాడనే భయం వెంటాడినా టీమిండియా అభిమానులు సైతం అతడిని ప్రశసించకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు.

బ్రేస్‌వెల్‌ పోరాటపటిమకు మన ఆటగాళ్లు కూడా ముగ్ధులుకాకుండా ఉండలేకపోయారు. కానీ.. దురదృష్టం బ్రేస్‌వెల్‌ను వెక్కిరించింది. వెరసి జట్టు ఓటమిపాలైంది. దీంతో కివీస్‌ అభిమానులు హృదయాలు ముక్కలయ్యాయి. బ్రేస్‌వెల్‌ పరిస్థితి కూడా అదే!

‘‘భారీ స్కోరు చేసిన టీమిండియాను ఓడించడం అంత తేలికేం కాదు. కానీ దురదృష్టవశాత్తూ మేము ఈరోజు పని పూర్తి చేయలేకపోయాం. ఆఖరి వరకు పోరాడాం. కానీ.. ఈరోజు నాది కాదు.. నిజంగా ఈ రోజు నాది కాకుండా పోయింది’’ అని మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశాడు. 

క్రికెటర్ల కుటుంబం.. లేట్‌ అయినా..
మైకేల్‌ బ్రేస్‌వెల్‌ తండ్రి మార్క్‌ కూడా క్రికెటరే! డొమెస్టిక్‌ లెవల్లో ఆడాడు. అంతేకాదు మైకేల్‌ అంకుల్స్‌ బ్రెండన్‌ బ్రేస్‌వెల్‌, జాన్‌ బ్రేస్‌వెల్‌లు కూడా క్రికెట్‌ ఆడినవాళ్లే. ఇక మైకేల్‌ కజిన్‌ డగ్‌ బ్రేస్‌వెల్‌ కూడా న్యూజిలాండ్‌కు ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి అండర్‌-19 జట్టు ఆడారు. అయితే, డగ్‌ 2011లో ఎంట్రీ ఇవ్వగా.. మైకేల్‌కు చాలా కాలం పట్టింది. ఉప్పల్‌ మ్యాచ్‌లో డగ్‌ బెంచ్‌కు పరిమితం కాగా.. మైకేల్‌ ఇలా సంచలన ఇన్నింగ్స్‌ ఆడటం విశేషం.

ఇదిలా ఉంటే.. చిన్ననాటి నుంచే క్రికెట్‌ వాతావరణంలో పెరిగిన మైకేల్‌కు ఐదేళ్ల వయసు నుంచే ఆటపై మక్కువ పెరిగిందట. అయితే, క్రికెట్‌తో పాటు రగ్బీ, బాస్కెట్‌బాల్‌పై కూడా అతడికి ఇష్టం ఎక్కువే. బ్రేస్‌వెల్‌ మరో కజిన్‌ మిలానీ బ్రేస్‌వెల్‌ కమెడియన్‌గా రాణిస్తున్నాడు.

ఇంట్లో ఎంతమంది క్రికెటర్లు ఉన్నా మైకేల్‌ బ్రేస్‌వెల్‌కు మాత్రం ఆసీస్‌ దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ ఆరాధ్య ఆటగాడు.  వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రేస్‌వెల్‌ 2019లో లారెన్‌ రాల్స్టన్‌ను పెళ్లాడాడు. ఈ జంటకు కుమారుడు లెనాక్స్‌ సంతానం.

నాన్న మాటే వేదం
1991 ఫిబ్రవరి 14న వయారరపలో జన్మించిన మైకేల్‌ బ్రేస్‌వెల్‌.. ఫస్ట్‌క్లాస్‌లో అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆలస్యమైనా.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నాడు. 

ఆడిన నాలుగో వన్డేలోనే శతకం బాది సత్తా చాటాడు. తండ్రి మాటకు విలువనిస్తాడు బ్రేస్‌వెల్‌. ‘‘నేను అందరితో అంత తొందరగా కలిసిపోలేను. అయితే, కాస్త సమయం దొరికినా మా నాన్నతో మాట్లాడుతూనే ఉంటా. నాకు రెండేళ్ల వయసున్నప్పటి నుంచి ఆయన నాకు సలహాలు ఇస్తున్నారు. నేను వాటిని పాటిస్తున్నా’’ అని బ్రేస్‌వెల్‌ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

చదవండి: సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్‌! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా..
Hashim Amla Facts In Telugu: మచ్చలేని క్రికెటర్‌.. కోహ్లితో పోటీపడి పరుగులు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top