Hashim Amla Facts In Telugu: మచ్చలేని క్రికెటర్‌.. కోహ్లితో పోటీపడి పరుగులు

Intresting Facts About Former SA Cricketer Hashim Amla - Sakshi

సౌతాఫ్రికా క్రికెట్‌లో మరొక శకం ముగిసింది. ప్రొటిస్‌ జట్టు సీనియర్‌ ఆటగాడు హషీమ్‌ ఆమ్లా బుధవారం(జనవరి 18న) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. వివాదాలకు దూరంగా.. ఇస్లాం మతానికి గౌరవం ఇస్తూ కెరీర్‌ను కొనసాగించిన అరుదైన క్రికెటరగా గుర్తింపు పొందాడు. తాను ధరించే జెర్సీపై ఎలాంటి లోగో లేకుండానే బరిలోకి దిగడం ఆమ్లాకు అలవాటు.

దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎక్కువగా స్పాన్సర్‌షిప్‌ ఇచ్చేది బీర్ల కంపెనీలే. ఇస్లాం మతంలో మద్యపానం నిషేధం. దానిని క్రికెట్‌ ఆడినంత కాలం మనసులో ఉంచుకున్న ఆమ్లా అంతర్జాతీయ మ్యాచ్‌లే కాదు కనీసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా జెర్సీపై దక్షిణాఫ్రికా జాతీయ చిహ్నం మినహా ఎలాంటి లోగో లేకుండా జాగ్రత్తపడేవాడు. కౌంటీ క్రికెట్‌ సహా  ఐపీఎల్‌ లాంటి ప్రైవేటు లీగ్స్‌లోనూ ఇదే జాగ్రత్తలు తీసుకునేవాడు.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

కోహ్లితో పోటీపడి పరుగులు..
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హషీమ్‌ ఆమ్లా ఒక దశలో టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లితో పోటీపడి పరుగులు సాధించేవాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . ముఖ్యంగా వన్డేల్లో ఆమ్లా, కోహ్లి మధ్య కొంతకాలం పరుగుల పోటీ నడిచిందని చెప్పొచ్చు.కోహ్లి ఒక రికార్డు అందుకోవడమే ఆలస్యం.. వెంటనే ఆమ్లా లైన్‌లోకి వచ్చి ఆ రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 55 సెంచరీల సాయంతో 18వేలకు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక సౌతాఫ్రికా టెస్ట్‌ టీమ్‌ కెప్టెన్‌గానూ వ్యవహరిం‍చిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్‌ సెంచరీ (311 నాటౌట్‌)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. 

మరి ఒకప్పుడు కోహ్లితో పోటీపడి పరుగులు సాధించిన ఆమ్లా ఆ తర్వాత ఎందుకనో వెనుకబడిపోయాడు. బహుశా వయస్సు పెరగడం.. ఫిట్‌నెస్‌ సమస్యలు.. జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడం అనుకుంటా. తర్వాత ఆమ్లాకు అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. అలా అంతర్జాతీయ క్రికెట్‌కు మెళ్లగా దూరమైన ఆమ్లా 2019 వన్డే ప్రపంచకప్‌ ముగియగానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు.

వివాదాలకు ఆమడ దూరం..
క్రికెట్‌ ఆడినంత కాలం ఆమ్లా ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోలేదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే ఆమ్లా చాలా నెమ్మదస్తుడు. ఒక్కసారి క్రీజులో అడుగుపెట్టాడంటే అతన్ని ఔట్‌ చేయడం అంత సులువు కాదు. ఎ‍న్నోసార్లు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. భారత్‌ మూలాలున్న హషీమ్‌ ఆమ్లా స్పిన్‌ బౌలింగ్‌ను అవలీలగా ఆడగల సమర్థుడు. 

డీన్‌ జోన్స్‌ వివాదం


ఆమ్లా క్రికెట్‌ కెరీర్‌లో ఏదైనా వివాదం ఉందంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌.. కామెంటేటర్‌ డీన్‌ జోన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. 2013లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా మాటల మధ్యలో డీన్‌ జోన్స్‌ ఆమ్లాను ఉగ్రవాది అని సంబోధించాడు. ఆ మ్యాచ్‌లో కుమార సంగక్కర ఇచ్చిన క్యాచ్‌ను ఆమ్లా అందుకున్నాడు. వెంటనే డీన్‌ జోన్స్‌.. ఉగ్రవాదికి మరొక వికెట్‌ లభించింది. ఇది పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత డీన్‌ జోన్స్‌ తన వ్యాఖ్యలపై ఆమ్లాకు క్షమాపణ చెప్పినప్పటికి బ్రాడ్‌కాస్టర్స్‌ అతన్ని జాబ్‌ నుంచి తొలగించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 18వేలకు పైగా పరుగులు..
ఆమ్లా తన కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరపున 124 టెస్టులు ఆడి 46.64 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉండగా.. 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక  స్కోరు.. 311. ఇక 181 వన్డేలలో 8,113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ఇక 44 టీ20లలో 8 అర్ధశతకాలతో 1277 పరుగులు చేశాడు.

ఇక కౌంటీ క్రికెట్ లో ఆమ్లా గణాంకాలు రికార్డులే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పనుకున్నాక ఆమ్లా సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 265 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన ఆమ్లా 19521 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్.. 311 నాటౌట్. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో 247 మ్యాచుల్లో10020 పరుగులు చేశాడు.హైయెస్ట్ స్కోరు 159. ఇక టీ20 క్రికెట్ లో 164 మ్యాచుల్లో 2 సెంచరీల సాయంతో 4563 పరుగులు చేశాడు.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌

డబుల్‌ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..?

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top