Double Centuries In ODIs: డబుల్‌ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..?

7 Out Of 10 ODI Double Centuries Scored By Indians, All Scored By Openers - Sakshi

వన్డే క్రికెట్‌లో సెంచరీ సాధించాలంటే ముక్కీ మూలిగి, 150, 200 బంతులను ఎదుర్కొని, ఆఖరి ఓవర్లలో ఆ మార్కును దాటే రోజులు పోయాయి. టీ20 క్రికెట్‌ పుణ్యమా అని వన్డే క్రికెట్‌లోనూ వేగం పెరగడంతో ఆటగాళ్లు తృణప్రాయంగా సెంచరీలు బాదేస్తున్నారు. ఒకప్పుడు సెంచరీ సాధించాలంటే ఓపెనర్లు లేదా వన్‌డౌన్‌, టూ డౌన్‌లలో వచ్చే ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేది.

అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరు, ఏడు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు కూడా అలవోకగా సెంచరీలు కొట్టేస్తున్నారు. ఓపెనింగ్‌ వచ్చే ఆటగాళ్లైతే బఠానీలు నమిలినంత ఈజీగా డబుల్‌ సెంచరీలు బాదేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ శుభ్‌మన్‌ గిల్‌. ఈ భారత యువ ఓపెనర్‌ ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు.

ఇంతకు కొద్ది రోజుల ముందే (డిసెంబర్‌ 10, 2022) మరో భారత ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ బంగ్లాదేశ్‌పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు వన్డేల్లో 10 డబుల్‌ సెంచరీలు నమోదు కాగా, అందులో భారత ఆటగాళ్లు సాధించినవి ఏడు ఉండటం విశేషం. మరో విశేషమేమిటంటే ఈ పది డబుల్‌ సెంచరీలు కూడా ఓపెనర్లు సాధించినవే కావడం. 

వన్డేల్లో తొట్ట తొలి డబుల్‌ సెంచరీ సాధించింది క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో సౌతాఫ్రికాపై సచిన్‌ 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆతర్వాత 

  • వీరేంద్ర సెహ్వాగ్‌ (2011లో వెస్టిండీస్‌పై 219), 
  • రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209), 
  • రోహిత్‌ శర్మ (2014లో శ్రీలంకపై 264), 
  • క్రిస్‌ గేల్‌ (2015లో జింబాబ్వేపై 215), 
  • మార్టిన్‌ గప్తిల్‌ (2015లో వెస్టిండీస్‌పై 237*), 
  • రోహిత్‌ శర్మ (2017లో శ్రీలంకపై 208*), 
  • ఫకర్‌ జమాన్‌ (2018లో జింబాబ్వేపై 210*), 
  • ఇషాన్‌ కిషన్‌ (2022లో బంగ్లాదేశ్‌పై 210), 
  • శుభ్‌మన్‌ గిల్‌ (2023లో న్యూజిలాండ్‌పై 208) డబుల్‌ సెంచరీలు సాధించారు. 

మహిళల క్రికెట్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రెండు డబుల్‌ సెంచరీలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్‌ 1997లోనే డెన్మార్క్‌పై 229* పరుగులు సాధించింది. ఆ తర్వాత 2018లో న్యూజిలాండ్‌కు చెం‍దిన అమెలియా కెర్ ఐర్లాండ్‌పై 232* పరుగులు సాధించింది.

ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ సాధించింది బెలిండా క్లార్క్‌ కాగా, అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించింది రోహిత్‌ శర్మ (3). ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఇషాన్‌ కిషన్‌ (126) పేరిట ఉండగా, అత్యంత పిన్న వయసులో ఈ ఫీట్‌ సాధించిన ఘనత శుభ్‌మన్‌ గిల్‌ (23 ఏళ్ల 132 రోజులు) పేరిట నమోదై ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top