IND VS NZ 1st T20: పృథ్వీ షాకు లైన్‌ క్లియర్‌, తుది జట్టు ఇలా ఉంటుంది..!

IND VS NZ 1st T20 2023: Predicted Team India - Sakshi

యువ ఓపెనర్‌ పృథ్వీ షాకు దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాకు ఆడే అవకాశం లభించనుంది. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం బారిన పడటంతో షాకు తుది జట్టులో స్థానం లభించడం దాదాపుగా ఖరారైంది. షా చివరిసారిగా 2021 జులైలో శ్రీలంకతో టీ20 మ్యాచ్‌ ఆడాడు. షా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌ ఇదే. ఆ మ్యాచ్‌లో షా తొలి బంతికే గోల్డన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇటీవల ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో భారీ ట్రిపుల్‌ సెంచరీ బాదడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించిన షా.. రేపు (జనవరి 27) రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే తొలి టీ20లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు విషయానికొస్తే.. షాతో పాటు మరో ఓపెనర్‌గా భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.

వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, ఆతర్వాత దీపక్‌ హుడా, హార్ధిక్‌ పాం‍డ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావీ, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్టే. ఒకవేళ లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ ఉంటే బాగుంటుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తే.. షా స్థానంలో ఇషాన్‌, వన్‌ డౌన్‌లో షా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, ఈ ప్రయోగకర సమీకరణను ట్రై చేసే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు.   

కాగా, భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలి టీ20లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తాజాగా ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన జోష్‌లో టీమిండియా ఉండగా.. టీ20 సిరీస్‌నైనా కైవసం‍ చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు జనవరి 29, ఫిబ్రవరి 1న జరుగనున్నాయి. రెండో టీ20 లక్నో వేదికగా, మూడో మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరుగనున్నాయి.  

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుం‍దర్‌, శివమ్‌ మావీ, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వేంద్ర చహల్‌, ముకేశ్‌ కుమార్‌

న్యూజిలాండ్‌ జట్టు..
మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారల్‌ మిచెల్‌, మైఖేల్‌ రిప్పన్‌, మార్క్‌ చాప్‌మన్‌, ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, డేన్‌ క్లీవర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, జాకబ్‌ డఫ్ఫీ, బెన్‌ లిస్టర్‌, ఐష్‌ సోధీ, లోకీ ఫెర్గూసన్‌, హెన్రీ షిప్లే, బ్లెయిర్‌ టిక్నర్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top