
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా (IND vs ENG 5th Test) సరికొత్త చరిత్ర లిఖించింది. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. అయితే, విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్‌గా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది.
కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలదు.
జైసూ సెంచరీ
ఇక ఈ మ్యాచ్‌లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ.. ఈ సిరీస్‌లో రెండోది.
12 సెంచరీలు
అదే విధంగా.. జైసూ శతకంతో ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ఇప్పటికి 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యంకాగా.. తాజాగా టీమిండియా కూడా చరిత్ర పుటల్లోకెక్కింది.
ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 25, రవీంద్ర జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ శతకం (118), ఆకాశ్ దీప్ అర్ధ శతకం (66)తో అదరగొట్టారు.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్-2025లో ఇప్పటి వరకు శతకాలు బాదింది వీరే
యశస్వి జైస్వాల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ది ఓవల్- లండన్)
శుబ్‌మన్ గిల్- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్- బర్మింగ్‌హామ్, ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్ )
రిషభ్ పంత్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్)
కేఎల్ రాహుల్- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్, లార్డ్స్- లండన్)
రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)
వాషింగ్టన్ సుందర్- 1 సెంచరీలు (ఓల్డ్ ట్రఫోర్డ్- మాంచెస్టర్)
ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లు
ఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- ఐదు టెస్టుల్లో- 12 సెంచరీలు
పాకిస్తాన్- 1982/83లో సొంతగడ్డపై టీమిండియా మీద ఆరు టెస్టుల్లో- 12 సెంచరీలు
సౌతాఫ్రికా- 2003/04లో సొంతగడ్డపై వెస్టిండీస్ మీద నాలుగు టెస్టుల్లో- 12 సెంచరీలు
టీమిండియా- 2025లో ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య జట్టు మీద- 12 సెంచరీలు
చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్
𝘾𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙖𝙜𝙖𝙞𝙣𝙨𝙩 𝙖𝙡𝙡 𝙤𝙙𝙙𝙨 🥶
🗣 #YashasviJaiswal completes a dramatic knock to bring up his 6th International Test century in style! 🔥#ENGvIND 👉 5th TEST, DAY 3 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/3V6YCy3sHy pic.twitter.com/ezdwfz3oYi— Star Sports (@StarSportsIndia) August 2, 2025