
PC: Starsports X
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) అర్ధ శతకంతో మెరిశాడు. శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా డెబ్బై బంతుల్లో యాభై పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీని ఇంగ్లండ్ గడ్డ మీద నమోదు చేశాడు.
గంభీర్, గిల్, జడేజా రియాక్షన్ వైరల్
నైట్ వాచ్‌మన్‌గా వచ్చి అర్ధ శతకంతో ఆకాశ్ దీప్ ఇరగదీయడంతో భారత శిబిరంలో నవ్వులు పూశాయి. హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఆకాశ్ బ్యాట్ పైకెత్తగానే.. కెమెరాలు ఇండియన్ డ్రెసింగ్‌రూమ్ వైపు మళ్లాయి. లోపల కూర్చుని ఉన్న హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చిరునవ్వులు చిందించాడు.
మరోవైపు.. బయటకు వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చప్పట్లతో ఆకాశ్ దీప్‌ను ఉత్సాహపరుస్తూ అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ 43వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్.. పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.
66.. అవుట్
అక్కడికి దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న గస్ అట్కిన్సన్ పరుగెత్తుకుని వచ్చి డైవ్ చేసి మరీ బంతిని అందుకున్నాడు. దీంతో ఆకాశ్ దీప్ ‘హీరోచిత’ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న అతడు.. 12 ఫోర్ల సాయంతో 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఫలితంగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.
కాగా 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి టీమిండియా.. భోజన విరామ సమయానికి 44 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ 85, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఇంగ్లండ్ కంటే 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు
👉వేదిక: కెన్నింగ్‌టన్ ఓవల్, లండన్
👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్
👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 224
👉ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 247.
చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్
A maiden international 5️⃣0️⃣ for Akash Deep 👏#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/O1wAt9ecyg
— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2025