ఆకాశ్‌ ధనాధన్‌.. తొలి హాఫ్‌ సెంచరీ! డకెట్‌తో.. నిన్న అలా.. ఈరోజు ఇలా! | Ind vs Eng: Akash Deep Maiden Fifty And Ben Duckett Hug Him Pics Viral | Sakshi
Sakshi News home page

Akash- Duckett: ఆకాశ్‌ ధనాధన్‌.. తొలి హాఫ్‌ సెంచరీ! డకెట్‌తో.. నిన్న అలా.. ఈరోజు ఇలా!

Aug 2 2025 5:03 PM | Updated on Aug 2 2025 5:14 PM

Ind vs Eng: Akash Deep Maiden Fifty And Ben Duckett Hug Him Pics Viral

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ (Ben Dcukett) టీమిండియా అభిమానులను ఆశ్చర్యపరిచాడు. భారత పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (Akash Deep)ను ఆలింగనం చేసుకుని స్వీట్‌ షాకిచ్చాడు. ఇంగ్లండ్‌- భారత్‌ (Ind vs Eng) మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

క్రీడా స్ఫూర్తిదే విజయం
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘చిన్న చిన్న యుద్ధాలు.. అయితే వాటిపై అంతిమంగా క్రీడా స్ఫూర్తిదే విజయం’’ అంటూ క్రికెట్‌ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓవల్‌ టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డకెట్‌- ఆకాశ్‌ మధ్య నువ్వా- నేనా అన్నట్లు పోటీ జరిగిన విషయం తెలిసిందే.

భుజంపై చెయ్యి వేసి.. నవ్వులు చిందిస్తూ
ఆకాశ్‌ బౌలింగ్‌లో బౌండరీలు బాదిన డకెట్‌.. ఆఖరికి రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి వికెట్‌ సమర్పించుకున్నాడు. దీంతో తనదే పైచేయి అన్నట్లుగా  ఆకాశ్‌ దీప్‌.. డకెట్‌ క్రీజును వదిలి వెళ్తుంటే అతడి భుజంపై చెయ్యి వేసి.. నవ్వులు చిందిస్తూ స్లెడ్జ్‌ చేశాడు. అయితే, డకెట్‌ కూల్‌గానే ఇందుకు సమాధానమిస్తూ పెవిలియన్‌కు చేరాడు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. ఆకాశ్‌ దీప్‌పై విమర్శలు వచ్చాయి. అయితే, శనివారం నాటలో భాగంగా ఫీల్డర్‌ డకెట్‌ వచ్చి.. ‘బ్యాటర్‌’ ఆకాశ్‌ దీప్‌ను హగ్‌ చేసుకోవడం విశేషం. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.

కాగా ఓవల్‌ మైదానంలో 224 పరుగులకు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగించగా.. ఇందుకు సమాధానంగా ఇంగ్లండ్‌ 247 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.

ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (7), సాయి సుదర్శన్‌ (11) నిరాశపరిచారు. అయితే మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 51 పరుగులతో.. ఆకాశ్‌ దీప్‌ నాలుగు పరుగులతో క్రీజులో నిలిచాడు. 

తొలి హాఫ్‌ సెంచరీ
ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆరంభం నుంచే.. జైస్వాల్‌తో కలిసి ఆకాశ్‌ దీప్‌ ధనాధన్‌ దంచికొట్టాడు.  70 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఫోర్‌  బాది మరీ యాభై పరుగుల మార్కును చేరుకోవడం విశేషం. టెస్టులలో అతడికి ఇదే తొలి హాఫ్‌ సెంచరీ.

ఇక 40 ఓవర్ల ముగిసేసరికి జైస్వాల్‌ 82, ఆకాశ్‌ దీప్‌ 53 పరుగులతో ఉన్నారు. భారత్‌ స్కోరు: 158/2 (40). ఇంగ్లండ్‌ కంటే 135 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆకాశ్‌ దీప్‌.. 80 పరుగులు ఇచ్చి.. డకెట్‌ (38 బంతుల్లో 43) రూపంలో కీలక వికెట్‌ తీశాడు. 

చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement