IND VS AUS 2nd ODI: సూర్యకుమార్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ

IND VS AUS 2nd ODI: Surya Kumar Yadav Completes 50 In 24 Balls, 6th Fastest 50 By An Indian - Sakshi

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో భారత్‌ తరఫున ఆరో వేగవంతమైన హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న స్కై 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వన్డేల్లో ఆసీస్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌.

వన్డేల్లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ ఎవరిదంటే..?
వన్డేల్లో భారత్‌ తరఫున వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డు ప్రస్తుత భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పేరిట నమోదై ఉంది. 2000 సంవత్సరంలో అగార్కర్‌ జింబాబ్వేపై 21 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆతర్వాత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ కపిల్‌ దేవ్‌ పేరిట ఉంది. కపిల్‌ 1983లో వెస్టిండీస్‌పై 22 బంతుల్లో  ఫిఫ్టి కొట్టాడు. ఆతర్వాత వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌  ద్రవిడ్‌, యువరాజ్‌ సింగ్‌ 22 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశారు. ఇవాల్టి మ్యాచ్‌లో స్కై చేసిన 24 బంతుల ఫిఫ్టి వన్డేల్లో భారత్‌ తరఫున ఆరో ఫాసెస్ట్‌ ఫిఫ్టిగా రికార్డైంది. 

వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన స్కై..
గ్రీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌లో సూర్యకుమార్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు​ బాది గ్రీన్‌కు దడ పుట్టించాడు. ఈ ఓవర్‌లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన స్కై.. ఓవర్‌లో మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. స్కై ధాటికి గ్రీన్‌ 10 ఓవర్లలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా గ్రీన్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

ఓ ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా..
ఈ మ్యాచ్‌లో గ్రీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన స్కై.. వన్డేల్లో ఓ ఓవర్లో ఆసీస్‌పై అత్యధిక సిక్సర్లుగా బాదిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (104), శ్రేయస్‌ అయ్యర్‌ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 72 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్‌ కిషన్‌ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్‌ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో కెమరూన్‌ గ్రీన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, జోష్‌ హాజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top