Ravindra Jadeja: నా దృష్టిలో నిజమైన హీరో జడేజానే! నువ్వేనా ఈ మాట అన్నది? నిజమా!

Ind Vs Aus 1st ODI: Actual Hero Was Jadeja Says Sanjay Manjrekar - Sakshi

‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా కాలం తర్వాత టీమిండియా.. బౌలింగ్‌ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మిచెల్‌ మార్ష్‌ అద్భుత బ్యాటింగ్‌ చూసి.. ఆస్ట్రేలియా కచ్చితంగా 350 పరుగుల మార్కు దాటుతుందని అనుకున్నాం. కానీ.. టీమిండియా బౌలర్లు వారిని కట్టడి చేశారు. షమీ, సిరాజ్‌ వికెట్లు తీశారు. అయితే... నా దృష్టిలో మాత్రం నిజమైన హీరో రవీంద్ర జడేజా’’.....

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. 5 పరుగులకే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. 

అయితే, మరో ఓపెనర్‌ మార్ష్‌ ఆ సంతోషాన్ని ఎక్కువ సేపు నిలువనీయలేదు.. 10 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. అతడి దూకుడు చూస్తే ఆసీస్‌ భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది.

కీలక సమయంలో రాణించి
కానీ.. భారత పేసర్లు సిరాజ్‌, షమీ కలిసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. షమీ ఆరు ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ 5.4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు ఒకటి, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

ప్రమాదకరంగా మారి జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న మార్ష్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. అంతేకాదు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రూపంలో మరో కీలక బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా 9 ఓవర్ల బౌలింగ్‌లో 46 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు.

ఆల్‌రౌండర్‌ జడ్డూ..
ఈ క్రమంలో ముంబై మ్యాచ్‌లో 35.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా కథ ముగిసింది. 188 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్‌ అయింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన హార్దిక్‌ సేన ఆరంభంలో తడబడినా.. కేఎల్‌ రాహుల్‌(75), రవీంద్ర జడేజా(45) అద్భుత అజేయ ఇన్నింగ్స్‌తో విజయం అందించారు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకుని, లబుషేన్‌ను అవుట్‌ చేయడంలో సంచలన క్యాచ్‌తో మెరిసిన జడేజాను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

దటీజ్‌ జడేజా.. నిజమైన హీరో
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ జడేజాను ప్రశంసిస్తూ పైవిధంగా స్పందించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐదు నెలల తర్వాత టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు.

ఇప్పుడు వన్డేలో కూడా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌. బ్యాటింగ్‌ బౌలింగ్‌ మాత్రమే కాదు అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో జట్టును గెలిపిస్తున్నాడు. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం చాలా కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. జట్టుకు ప్రధాన బలంగా మారాడు’’ అంటూ జడ్డూను మంజ్రేకర్‌ ఆకాశానికెత్తాడు.

అప్పుడలా.. ఇప్పుడిలా..
గతంలో మంజ్రేకర్‌ జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ తక్కువ చేసిన మాట్లాడగా.. అదే రేంజ్‌లో జడ్డూ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీ సందర్భంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన నేపథ్యంలో మంజ్రేకర్‌ మాటలు కలిపాడు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రవీంద్ర జడేజాను మంజ్రేకర్‌ ప్రశంసించడం నెట్టింట వైరల్‌గా మారింది. ‘మంజ్రేకర్‌ నువ్వేనా ఈ మాట అంటున్నది! నిజమేనా.. నమ్మలేకపోతున్నాం’ అంటూ జడ్డూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: KL Rahul: రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. కారణమిదే అంటున్న ఫ్యాన్స్‌! కోహ్లి కూడా..
NZ VS SL 2nd Test: డబుల్‌ సెంచరీలు బాదిన కేన్‌ విలియమ్సన్‌, హెన్రీ నికోల్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top