
India vs Australia, 1st ODI- KL Rahul: 91 బంతుల్లో.. 7 ఫోర్లు.. ఒక సిక్సర్.. 75 పరుగులు(నాటౌట్)... మరీ అంత గొప్ప గణాంకాలేమీ కాకపోవచ్చు... కానీ అత్యంత విలువైనవి.. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన ఆపద్భాంధవుడిలా మారిన ఓ ఆటగాడు తన ప్రతిభను వెలికితీసి.. సొంతగడ్డపై జట్టుకు పరాభవం ఎదురుకాకుండా కాపాడేందుకు ఉపయోగపడినవి.
భారమైన హృదయంతో బరిలోకి దిగిన సదరు బ్యాటర్ సగర్వంగా తలెత్తుకుని.. తనను విమర్శించిన నోళ్లకు, తన గురించి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవాలని తహతహలాడిన వాళ్లకు బ్యాట్‌తో సమాధానం ఇచ్చేందుకు సాయపడినవి.
ఆ 75 పరుగులే ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినవి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత జట్టు.. లక్ష్య ఛేదనలో తడబడిన వేళ కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి జాలువారినవి.
ఆసీస్‌పై విజయంతో
ఆల్‌రౌండర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రవీంద్ర జడేజా(45 పరుగులు, నాటౌట్, 2 వికెట్లు)తో కలిసి రాహుల్ పటిష్ట భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు అజేయంగా నిలిచిన వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విజయతీరాలకు చేరింది. లో స్కోరింగ్ వన్డేలో హార్దిక్ సేన గెలుపొంది 1-0తో సిరీస్‌లో ముందంజ వేసింది.
కారణమిదే అంటున్న ఫ్యాన్స్!
ఈ నేపథ్యంలో రాహుల్- జడ్డూ పట్టుదలగా నిలబడి పోరాడిన తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా తారస్థాయిలో ట్రోలింగ్ బారిన పడ్డ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్.. ఇలా ఘనమైన ‘పునరాగమనం’తో సత్తా చాటడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆ దేవుడి దయ వల్లే రాహుల్‌కు మంచి జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో రాహుల్ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండోర్‌లో మూడో టెస్టు నేపథ్యంలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించాడు. సతీమణి అతియా శెట్టితో కలిసి దేవుడిని దర్శించి పూజలు, అభిషేకాలు చేశాడు.
ఈ క్రమంలో మొదటి వన్డేతో జట్టులోకి తిరిగి వచ్చిన రాహుల్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రాహుల్ గుడిలో ఉన్న ఫొటోలు తెరమీదకు తెచ్చిన నెటిజన్లు.. ‘‘రాహుల్ విజయ రహస్యం ఇదేనా! అయినా, ప్రతిభకు తోడు ఆ దేవుడి దయ ఉంటే ఏదైనా సాధించవచ్చు’’ అని పేర్కొంటున్నారు.
కోహ్లి సైతం
అదే సమయంలో మరికొంత మంది విరుష్క జోడీ ఫొటోలు షేర్ చేస్తూ.. ఆఖరి టెస్టులో విరాట్ కోహ్లి సెంచరీ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇండోర్ టెస్టు తర్వాత కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అహ్మదాబాద్ మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన కోహ్లి.. దాదాపు మూడేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ కరువు తీర్చుకున్నాడు.
కెరీర్‌లో 75వ అంతర్జాతీయ శతకం సాధించి పలు రికార్డులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి, రాహుల్ ప్రార్థనలు ఫలించాయని.. వాళ్లిద్దరు ఆ భగవంతుడి కృపకు పాత్రులయ్యారని ఫ్యాన్స్ అంటున్నారు.
చదవండి: Ravindra Jadeja: 'రాహుల్ గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం'
ఐదు రోజుల వ్యవధిలో మరోసారి విరుచుకుపడిన కేన్ మామ
Virat Kohli and KL Rahul What a comeback from both of them#KLRahul𓃵 pic.twitter.com/TP9GD62oFG
— Ram Rathore (@RamRath37539162) March 17, 2023