
భారత్, ఇంగ్లండ్ అండర్ 19 జట్ల మధ్య జరిగిన తొలి యూత్ టెస్ట్ డ్రాగా ముగిసింది. బెకెన్హమ్‌లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆట చివరి రోజు అయిన నాలుగో రోజు భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 270 పరుగుల స్కోర్ వద్ద ఆగిపోయింది.
భారత బౌలర్లకు మరికాస్త సమయం దొరికివుంటే ఈ మ్యాచ్‌లో ఫలితం తేలిది. విజయానికి యంగ్ ఇండియా మరో 3 వికెట్ల దూరంలో మాత్రమే ఉండింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ సారధి హమ్జా షేక్ (112) అద్భుతమైన సెంచరీతో ప్రతిఘటించారు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు బెన్ మేస్ (51), థామస్ రూ (50) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అంబరీష్ 2, దేవేంద్రన్, అన్మోల్‌జీత్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (56), విహాన్ మల్హోత్రా (63), అంబరీష్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కెప్టెన్ ఆయుశ్ మాత్రే 32 పరుగులకు ఔటయ్యాడు.
బ్యాట్‌తో విఫలమైనా, బంతితో చెలరేగిన ఆర్చీ వాన్
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ మైఖేల్ వాన్ తనయుడు ఆర్చీ వాన్ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో (2, 3) విఫలమైనా బంతితో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన వాన్.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
మాత్రే సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్‌ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (14) ఈ ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు.
సెంచరీ మిస్ చేసుకున్న ఫ్లింటాఫ్ తనయుడు
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ (93) సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీతో పాటు కెప్టెన్ హమ్జా షేక్ (84) సత్తా చాటారు. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఎకాంశ్ సింగ్ (59), రాల్ఫీ ఆల్బర్ట్ (50) అర్ద సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, వైభవ్ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్ దేవేంద్రన్, మొహమ్మద్ ఎనాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది.