
Rohit Sharma-Virat Kohli: టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లి(టెస్ట్), రోహిత్ శర్మ(పరిమిత ఓవర్లు)లు కలిసి ఆడేందుకు సముఖంగా లేరని వస్తున్న వార్తలపై భారత మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ స్పందించాడు. కోహ్లి, రోహిత్‌లు కలిసి ఆడకపోతే జట్టుతో పాటు వాళ్లు కూడా నష్టపోతారని హెచ్చరించాడు. ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడకపోవడం వల్ల తొలుత జట్టుకే నష్టం వాటిల్లినప్పటికీ.. ఆతర్వాత కొద్ది రోజులకే వాళ్ల కెరీర్‌లు కూడా ముగుస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జట్టులో ఎవరూ శాశ్వతం కాదని.. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ లాంటి చాలా మంది దిగ్గజాలు వచ్చారు, వెళ్లారు అని ఉదహరించాడు. ఈ సందర్భంగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపై స్పందించాడు. దక్షిణాఫ్రికాలోని హార్డ్ పిచ్‌లు ప్రపంచంలోని మిగతా పిచ్‌లకు భిన్నమని, అలాంటి పిచ్‌లపై అనుభవజ్ఞులైన కోహ్లి, రోహిత్‌ల అవసరం టీమిండియాకు ఎంతైనా ఉందని అన్నాడు. కీలక పర్యటనకు ముందు జట్టులో విభేదాలు ప్రత్యర్ధికి అనుకూలంగా మారడంతో పాటు ఘన చరిత్ర కలిగిన భారత క్రికెట్ పరువును బజారుకీడుస్తాయని వాపోయాడు.
కాగా, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో అతను టెస్ట్ సిరీస్‌కు దూరమవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు ఇష్టం లేని కోహ్లి, కుమార్తె పుట్టినరోజును కారణంగా చూపి సెలవు కోరాడని, ఈ కారణంగా అతను వన్డేలకు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఖండిస్తూ.. రోహిత్ సారధ్యంలో వన్డేలు ఆడేందుకు సిద్ధమేనంటూ కోహ్లి తాజాగా ప్రకటించాడు.
చదవండి: Rohit-Virat: ఆట కంటే ఆటగాళ్లెవరూ గొప్ప కాదు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు