
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ (Dilip Vengarkar) ఘాటు విమర్శలు చేశాడు. ఫిట్‌గా లేనపుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడవద్దని.. అయినా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇలాంటి వాళ్లకు ఎందుకు అనుమతినిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించాడు.
పనిభారం తగ్గించాలని..
కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderosn- Tendukar Trophy)లో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ముగియగా ఇంగ్లండ్ రెండు, భారత్ ఒకటి గెలిచింది.
ఇదిలా ఉంటే.. భారత ప్రధాన పేసర్ బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు టెస్టులే ఆడతాడని యాజమాన్యం ముందుగానే ప్రకటించింది. ఫిట్‌నెస్ సమస్యల ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా అతడిపై పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
దిలీప్ వెంగ్‌సర్కార్ ఫైర్
అందుకు తగ్గట్లుగానే తొలి టెస్టు ఆడిన బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. తిరిగి లార్డ్స్‌లో మూడో టెస్టు ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. తదుపరి మాంచెస్టర్ మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్‌సర్కార్ బుమ్రా, టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘ఒకవేళ టీమిండియాకు ఆడాలని అనుకుంటే ప్రతి ఒక్క ఆటగాడు తప్పక ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా లేకుంటే అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదు. తొలి, రెండో టెస్టుకు మధ్య 7- 8 ఎనిమిది రోజుల విరామం వచ్చింది. అయినా సరే అతడు రెండో టెస్టు ఆడలేదు.
గంభీర్, అగార్కర్‌లకు నచ్చుతుందేమో గానీ
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. అగార్కర్, గంభీర్‌లు ఇలాంటివి ఆమోదిస్తారేమో కానీ.. ఎక్కడా ఇలా జరగదు’’ అంటూ దిలీప్ వెంగ్‌సర్కార్ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
టెస్టు మ్యాచ్‌లలో బౌలర్ల ఎంపిక విషయంలో తను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్న వెంగ్‌సర్కార్.. ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే జట్టు ప్రయోజనాల కోసం సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడాలని సూచించాడు.
అదే సమయంలో బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడికి ఉందని ప్రశంసించాడు. అయితే, ఒక్కసారి జట్టుతో చేరిన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడతా అంటే కుదరదు అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా టెస్టు సిరీస్‌లో టీమిండియాపై ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్ వేదిక.